Alleti Maheswar Reddy: కాంగ్రెస్, బీజేపీ దోస్తీ అని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపణలను పటాపంచెలు చేస్తూ ఆ రెండు పార్టీల నడుమ వార్ నడవబోతుందా? ఇప్పటివరకూ అంటీముట్టనట్టుగా ఉన్న బీజేపీ ప్రతిపక్ష మోడ్‌లోకి రానున్నదా? అవినీతి పోరాటంపై ఏలేటికి బీజేపీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో మంత్రుల కుంభకోణాలను బయటపెడతానని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Alleti Maheswar Reddy: ఇప్పటికే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గతంలో కూడా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా సివిల్ సప్లయ్‌లో పెద్ద అవినీతి జరిగిందని, ఆ అవినీతిలో మంత్రుల భాగస్వామ్యం ఉన్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ఆతర్వాత ఏమైందో ఏమోకానీ, వాటిపై బీజేపీ పెద్దలు వారించినట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంతకాలంపాటు మౌనం వహించిన ఏలేటి మళ్లీ అవినీతి ఆరోపణలతోనే ఘాటైన విమర్శలు చేయడంతో ఆసక్తి నెలకొన్నది. రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు.
Alleti Maheswar Reddy: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.1,38,117 కోట్లు అప్పు చేసిందని, దానిలో రూ.20 వేల కోట్లు రుణమాఫీకి వాడి, మిగతా రూ.1.16 లక్షల కోట్లు బడా కాంట్రాక్టర్లకు చెల్లించారని, కమీషన్ల కోసం సామాన్యులను ఇబ్బందులకు గురిచేసినట్టు విమర్శించారు. మరి ఈ అప్పు ఖర్చు పెట్టిన తీరుపై గుట్టు విప్పనున్నారా? మరేదైనా అవినీతిని బట్టబయలు చేయనున్నారా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొన్నది.
Alleti Maheswar Reddy: రైతుకూలీలకు కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్లాయని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 15 లక్షల మంది రైతు కూలీలు ఉన్నట్టు లెక్కలు చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రూ.9 వేల కోట్లను డిసెంబర్ 28లోగా వారి ఖాతాల్లో వేస్తామని చెప్పి సబ్ కమిటీ వేశారని, ఇందుకోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కమిటీని వేశారని తెలిపారు. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Alleti Maheswar Reddy: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వంపై, మంత్రులపై సంచలన ఆరోపణలు చేయడంపై ఉత్కంఠ నెలకొన్నది. దీనికి బీజేపీ అధిష్ఠానం అనుమతి కూడా ఉన్నట్టే తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని సమాచారం. ఈ దశలో ఏలేటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. ఆరోపణలను కట్టిపెట్టి, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించి నిరూపించుకోవాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు.
Alleti Maheswar Reddy: రెండు రోజుల్లోనే అంటూ ఆయన హింట్ ఇవ్వడంతో రేపు అంటే శనివారం కానీ, ఆదివారం కానీ కుంభకోణాల విషయాన్ని బహిర్గతం చేస్తారని తెలుస్తున్నది. దీనిపై అటు ప్రభుత్వంలోనూ గుబులు పట్టుకున్నది. మంత్రుల కుంభకోణాలు అంటూ ఆయన పేర్కొనడంపై కాంగ్రెస్‌లోనూ ఆందోళన నెలకొన్నది. ఏలేటి ఆరోపణలు ఎటు దారితీస్తాయోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత అసహనం రగులుతున్నది.