Aleti Maheshwar reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజూ సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన మొత్తం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆయన శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పేర్కొన్నారు.
నిమిషానికి రూ. 1 కోటీపైగా అప్పు
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటీపైగా అప్పు చేస్తోందని విమర్శిస్తూ, ఈ విధంగా రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పై రూ. 2.27 లక్షల రుణభారం ఉందని కూడా ఆయన తెలిపారు.
ఎన్‌డీఏ హయాంలో పెరిగిన కేంద్ర నిధులు
ఆర్థిక సంఘం నిధుల విషయమై ఆయన వివరిస్తూ, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతమే ఉంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 42 శాతానికి పెంచారని చెప్పారు.
విమర్శలు చేయడం తగదని హితవు
కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేయడం సరైంది కాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.