Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరుణుడు భీకరంగా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) మరో ముఖ్యమైన అప్‌డేట్ విడుదల చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ-నైరుతి గాలుల ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రాంతాల వారీగా వర్ష సూచనలు ఇలా ఉన్నాయి:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
సోమవారం, మంగళవారం మరియు బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చు. మంగళ, బుధవారాల్లో మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశముంది. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే రకమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మూడు రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయాలు, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలకు ముందు వాతావరణాన్ని పరిశీలించడం మంచిది.