Al Qaeda

Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాస్టర్‌మైండ్‌ షామా పర్వీన్‌ అరెస్టు

Al Qaeda: బెంగళూరులో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) చేతికి 30 ఏళ్ల షామా పర్వీన్ చిక్కారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర చేసిన అల్‌ఖైదా (AQIS) మాడ్యూల్‌లో ఆమె కీలక సూత్రధారిగా గుర్తించారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టు జరిగింది. పర్వీన్ కర్ణాటక నుంచే తన ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నెల 23న అల్‌ఖైదాతో సంబంధం ఉన్న మహమ్మద్ ఫర్దీన్ (అహ్మదాబాద్), సెఫుల్లా ఖురేషి (గుజరాత్), జీషన్ అలీ (ఉత్తరప్రదేశ్‌), మహమ్మద్ ఫాయిక్ (ఢిల్లీ) అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్‌, దిల్లీ, నోయిడాలో అరెస్టు చేశారు. వీరిని విచారించగా, తమ నాయకురాలు షామా పర్వీన్ అని వెల్లడించారు.

ఈ ఉగ్రవాద బృందం రహస్య, ఆటో డిలీటెడ్ యాప్‌ల ద్వారా ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకుంటున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో ఈ గ్రూప్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సభ్యులు ఉన్నారని, వారందరికీ షామా పర్వీనే నాయకత్వం వహిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపేందుకు ఈ బృందం కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: Jaishankar: సింధూ జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుంది

నిఘా వర్గాల సమాచారం ప్రకారం, హర్ష ఉపాధ్యాయ నేతృత్వంలోని గుజరాత్ ఏటీఎస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ టీం, అనేక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించింది. ముస్లిం యువతను రెచ్చగొడుతూ, దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించడానికి ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను వినియోగిస్తున్నట్లు తేలింది.

ఈ బృందానికి అల్‌ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్‌సెల్ విభాగాలతో పాటు, విదేశాలలో ఉన్న ఉగ్ర సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఉగ్ర ముఠాలకు చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం, ఈ గ్రూప్‌కు చెందిన ఇతర ఉగ్రవాద మద్దతుదారులు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేసే వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *