Akshay Kumar: పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఒక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.
కొన్ని నెలల క్రితం తన కుమార్తె నితార ఒక ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల నుండి భయానక అనుభవం ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు. “మొదట పరిచయం లేని వ్యక్తి గేమ్‌లో చాట్ చేస్తూ చాలా మర్యాదగా ప్రవర్తించాడు. ‘గేమ్ బాగా ఆడుతున్నావ్’ అంటూ పొగడ్తలు చెప్పాడు. కానీ క్రమంగా వ్యక్తిగత ప్రశ్నలు అడిగి, చివరకు ‘నీ న్యూడ్ ఫోటో పంపగలవా?’ అని మెసేజ్ పంపాడు. వెంటనే నా కుమార్తె గేమ్ ఆఫ్ చేసి, జరిగిన విషయం మా భార్యకు తెలిపింది. ఇది చాలా మంచి నిర్ణయం” అని అక్షయ్ వివరించారు.
ఈ ఘటనతో చిన్నారులు ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా ఎంత సులభంగా సైబర్ నేరగాళ్ల బారిన పడతారో స్పష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది నా కుమార్తె సమస్య మాత్రమే కాదు. ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో పిల్లలు బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారు. కొంతమంది నిరాశతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు.
ఈ డిజిటల్ యుగంలో పిల్లలకు సైబర్ సేఫ్టీ అవగాహన అత్యవసరమని అక్షయ్ కుమార్ నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి వారం ఒక పీరియడ్‌ను సైబర్ క్రైమ్ అవగాహనకు కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన విజ్ఞప్తి చేశారు.
“వీధి నేరాల కంటే ఈ సైబర్ నేరాలే ఇప్పుడిక మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టాలి” అని అక్షయ్ కుమార్ హెచ్చరించారు.

