Ahmedabad Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
మధ్యాహ్నం 1:17 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం, టేకాఫ్ అయిన వెంటనే అదుపుతప్పి సివిల్ ఆస్పత్రి సమీపంలోని జనావాసాలపై కూలిపోయింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు, ఫైరింజన్లు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Etala rajendar: మోదీ పాలనపై ఈటల ప్రశంసలు
Ahmedabad Plane Crash: ఈ దుర్ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్‌షా స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి రామ్మోహన్ కూడా ఘటనాస్థలానికి బయలుదేరారు.
విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారని, వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించబడింది.

