Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయి గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాద ఘటనలో, లండన్‌లో స్థిరపడిన ఓ భారతీయుడు తన భార్య చివరి కోరికను తీర్చడానికి స్వదేశానికి వచ్చి, తిరిగిరాని లోకాలకు చేరిన హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ రాష్ట్రం అమ్రేలి జిల్లాకు చెందిన అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా లండన్‌లో తన భార్య భారతీబెన్, నలుగు, ఎనిమిదేళ్ల వయసు గల ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అయితే, వారం రోజుల క్రితం అర్జున్‌భాయ్ భార్య భారతీబెన్ కన్నుమూసింది. మరణించే ముందు ఆమె తన అస్థికలను మాతృభూమిలోని నర్మదా నదిలో కలపాలని తన భర్తను కోరింది. భార్య చివరి కోరికను తీర్చడానికి అర్జున్‌భాయ్ తన ఇద్దరు పిల్లలను లండన్‌లోనే వదిలి, ఇటీవల ఇండియాకు వచ్చారు.
Also Read: Hyderabad: ఫ్రీ వైఫై వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..!
Ahmedabad Plane Crash: వాడియాలో బంధువులతో కలిసి భార్య అస్థికలను నర్మదా నదిలో కలిపిన అర్జున్, అనంతరం లండన్‌కు తిరిగి ప్రయాణమయ్యాడు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. భార్య చివరి కోరికను తీర్చిన సంతృప్తితో ఆయన ఆ విమానం ఎక్కాడు. కానీ, దురదృష్టవశాత్తు నిమిషాల వ్యవధిలోనే ఆయన ప్రాణం గాల్లోనే కలిసిపోయింది. అతను ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలింది.
అర్జున్‌భాయ్ మరణంతో, లండన్‌లో ఉన్న ఆయన ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారులు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కుటుంబంలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులను కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.