Adluri Laxman: అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమా

Adluri Laxman: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర కేబినెట్‌ను “దండుపాళ్యం బ్యాచ్”గా సంబోధించిన మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, హరీశ్ వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు. ఒక ఉద్యమ నాయకుడు అయి ఉండి కేబినెట్‌ను అలా పిలవడం సిగ్గుచేటు అని అన్నారు.

అడ్లూరి హరీశ్ రామును బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమని తెలిపారు. “మేము అక్కడికి వస్తాం, మీరు వస్తారా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కేబినెట్ మీటింగ్‌లు ప్రజల అవసరాల కోసం జరుగుతున్నాయని, దోపిడీ కోసం కాదని స్పష్టం చేశారు.

“2004లో ఉమ్మడి రాష్ట్రంలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, ఆ విషయం ఆయన మరవొద్దు” అని అడ్లూరి గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడటం దారుణమని విమర్శించారు. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనపై దూషణలు చేయించడం హరీశ్‌కి తగదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ ఇంతగా విమర్శలు చేయడం సరికాదన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను బీఆర్ఎస్ నెరవేర్చిందా అని అడ్లూరి నిలదీశారు. “పదేళ్లలో ఒక్కరికైనా నియామక పత్రం ఇచ్చారా?” అని ప్రశ్నించారు.

అదే సమయంలో, “ముఖ్యమంత్రిని, మంత్రులను ఏకవచనంలో మాట్లాడటం సరికాదు” అని హెచ్చరించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “ప్రజలే మాకు బుద్ధి చెబుతారు” అని అన్నారు.

అడ్లూరి కేంద్రంపై కూడా విమర్శలు గుప్పించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు ఎందుకు చేయడం లేదో రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఆస్తులు, ఫామ్ హౌస్‌ల కన్నా దళితుల ఆత్మగౌరవమే ముఖ్యమని అన్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్, గ్రామస్థాయి ఎన్నికల్లో ప్రజల తీర్పే తుది నిర్ణయం అవుతుందని వ్యాఖ్యానించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *