Adi Srinivas: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించేందుకు కేంద్రాన్ని ఒత్తిడిచేయకుండా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎందుకు మౌనం పాటిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీ ఒక అగ్రవర్ణ పార్టీగా వ్యవహరిస్తోందని, బీసీలకు అనుకూలమైన బిల్లును అంగీకరించకుండానే ఆ పార్టీ నేతలు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
బీసీలకు సమర్థంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసిన ఆయన, కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ‘‘మా పీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గానికి చెందినవారు. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరో చెప్పగలరా? బీజేపీలో బీసీలకు అధ్యక్ష పదవి ఇచ్చే ధైర్యం లేదా? మీ అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పండి’’ అని బీజేపీపై నిలదీశారు.
రేవంత్ రెడ్డి బీసీ కాకపోయినా, బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పే అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీనే నిజమైన సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ అని వ్యాఖ్యానించారు.
‘‘బీజేపీ మద్దతు లేకపోయినా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం ఖాయం’’ అని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.