MLA Dead: పంజాబ్‌లోని లూథియానాలోని హల్కా వెస్ట్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగి కాల్పుల్లో మరణించారు. ఈ ఘటన రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో గోగీ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను ఇంట్లో శుభ్రం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తుపాకీ శుభ్రం చేస్తున్నపుడు ఒక్కసారిగా బుల్లెట్ పేలింది. బుల్లెట్ ఎమ్మెల్యే తలలోంచి వెళ్లింది. దీంతో ఆయన కింద పడిపోయారు. పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు గాయపడిన ఆయనను దయానంద్ మెడికల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు, అక్కడ చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ కమిషనర్ జితేంద్ర జోర్వాల్, పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ గోగి ఇంటికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Sabarimala Makara Jyothi: మకరజ్యోతి దర్శనానికి రెడీ అవుతున్న శబరిమల
ఆ పిస్టల్ 25 బోర్లదని ఏడీసీపీ జస్కరన్ సింగ్ తేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్టు పోలీసులు చెప్పారు.
విషయం తెల్సిన వెంటనే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా తెల్లవారుజామున 4.30 గంటలకు గోగి ఇంటికి చేరుకున్నారు. గోగి కుటుంబానికి, పార్టీకి భారీ నష్టం వాటిల్లిందని అమన్ అరోరా అన్నారు. గోగి చాలా కష్టపడి పనిచేసే నాయకుడని ఆయన అన్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.