Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి మూడునెలలు గడిచినా తుది నివేదిక ఇంకా వెలువడలేదు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇప్పటికే 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. అందులో ఇంధన సరఫరా స్విచ్‌లు కొన్ని సెకన్ల వ్యవధిలో నిలిచిపోయాయని పేర్కొంది. రెండు ఇంజిన్‌లు ఒకేసారి ఆగిపోవడం వల్లే విమానం కూలిందని నివేదిక స్పష్టం చేసింది. అయితే, స్విచ్‌లను పైలట్లు ఉద్దేశపూర్వకంగా ఆపేశారనే అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకముందే ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డాయి.

తుది నివేదిక ఈ ఏడాది చివర్లోనే?

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం చివరి నాటికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)లను సవివరంగా పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Smriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోత

ప్రమాదం వివరాలు

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే అదుపు తప్పి సమీపంలోని మెడికల్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న 241 మందిలో ఒకరిని మినహాయించి అందరూ మరణించారు. హాస్టల్‌లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ప్రకటించింది.

పైలట్లపై వివాదం

ప్రాథమిక నివేదికలో, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్‌లో ఇద్దరు పైలట్లు ఇంధన ఆఫ్‌పై మాట్లాడుకున్నట్లు సూచనలు ఉన్నాయని పేర్కొంది. దీనితో కెప్టెన్ సుమీత్ సభర్వాల్ మరియు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పైలట్ సంఘాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి.

అదే సమయంలో, కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా జోక్యం చేసుకుని అధికారిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 2017 ఎయిర్‌క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం కేంద్రం అధికారికంగా దర్యాప్తు ఆదేశించవచ్చని ఆయన గుర్తు చేశారు.

ఎవరూ మరచిపోలేని విషాదం

ఈ ప్రమాదం భారత వైమానిక చరిత్రలోనే అత్యంత భయంకరమైనదిగా నిలిచింది. దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో మృతుల కుటుంబాలు, ప్రజలు నిజమైన కారణాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయో ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *