Peddapalli: కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తన తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వడం లేదని మనస్థాపానికి గురైన యువకుడు, కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎదుట పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అసలేం జరిగింది?
ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్‌గా గుర్తించారు. కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేసే సతీష్ తండ్రి, విధి నిర్వహణలో ఉండగా పాము కాటుకు గురై మరణించారు. అప్పటి నుంచి తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని సతీష్ పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాడు.
అధికారులు తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సతీష్, సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజల సమస్యలు వింటున్న సమయంలోనే, సతీష్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను తీసి తాగేందుకు ప్రయత్నించాడు. అక్కడున్న సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకుని అడ్డుకున్నారు.
యువకుడికి భరోసా
సతీష్‌ను అడ్డుకున్న సిబ్బంది అతడికి నచ్చజెప్పారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీ హర్ష అతడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సతీష్ సమస్యను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ హామీతో సతీష్ శాంతించాడు. ఈ ఘటనతో కలెక్టరేట్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

