Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలు సమస్యలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, వాటి పరిష్కారానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 30న విశాఖపట్నంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, పరిశ్రమలో ఉన్న మూడు ప్రధాన విభాగాలైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి ప్రతినిధులుగా 30 మందితో కూడిన ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీకి ఛైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్‌గా సెక్రటరీ దామోదర ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు ఈ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.
కమిటీ సభ్యుల విభజన ఇలా ఉంది:
నిర్మాతల విభాగం నుంచి
దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి. కల్యాణ్, రవికిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ
డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి
భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం. సుధాకర్, శిరీష్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి
ఎగ్జిబిటర్ల విభాగం నుంచి
రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి
ఈ కమిటీ ప్రధానంగా టాలీవుడ్‌లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అలాగే పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కీలక చర్యలను అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుంది. ఈ చర్యతో చలనచిత్ర రంగంలో పునర్వ్యవస్థీకరణకు బలమైన అడుగు పడినట్టయింది. ఇంతమంది ప్రముఖులు కలసి పని చేయడం వల్ల త్వరితగతిన పరిష్కారాలు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.