Viral Video: అల్లుడికి అత్తారింటి మర్యాదలు అంటేనే తెలుగు వారికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కనిపించే మర్యాదలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. అయితే, ఇప్పుడు ఆ ‘మర్యాద రామన్న’ ట్రెండ్ తెలంగాణలోనూ ఊపందుకుంటోంది. వనపర్తి జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి అత్తమామలు ఏర్పాటు చేసిన ‘బాహుబలి విందు’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తొలి దీపావళికి 150 రకాల విందు
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా, పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతులు తమ పెద్ద కూతురు శిరీషను, అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేశ్‌కు ఇచ్చి ఐదు నెలల క్రితం వివాహం జరిపించారు.
వివాహానంతరం తొలిసారి దీపావళి పండుగను పురస్కరించుకుని కొత్త అల్లుడు మహేశ్ అత్తవారింటికి రావడం జరిగింది. ఈ తొలి సందర్శనను చిరకాలం గుర్తుండిపోయేలా చేయాలని భావించిన అత్తామామలు.. తమ అభిమానాన్ని, ఆప్యాయతను చాటుతూ ఏకంగా 150 రకాలకు పైగా వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Sunny Deol: సన్నీ డియోల్ జోష్: దేశభక్తి సినిమాల సునామీ!
గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కొత్త అల్లుడికి పెట్టే మర్యాదలకు ధీటుగా ఈ విందు సిద్ధమైంది. అల్లుడి కోసం చేసిన ఈ బృహత్తర ప్రయత్నం చూసి, ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఈ విషయం విన్న ఊరి జనం సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
షాక్ అయిన కొత్త అల్లుడు మహేశ్
అత్తామామలు తమపై చూపిన అపారమైన అభిమానంతో ఏర్పాటు చేసిన ఈ భారీ విందును చూసి కొత్త అల్లుడు మహేశ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రకరకాల రుచులు, విభిన్నమైన పదార్థాలతో నిండిన విస్తరి ముందు కూర్చుని, భార్య శిరీషతో కలిసి ఆ విందును సంతోషంగా ఆరగించాడు.
అల్లుడిని సంతోష పెట్టేందుకు అత్తమామలు చేసిన ఈ ప్రత్యేక మర్యాదలు గ్రామంలో చర్చనీయాంశమయ్యాయి. భోజనం పూర్తయ్యాక, అత్తమామల ఆశీర్వచనాలు తీసుకున్న మహేశ్, వారి ఆతిథ్యాన్ని జీవితంలో మరువలేనని తెలియజేశాడు. కొత్త అల్లుడికి అత్తమామలు చూపిన ఈ అనూహ్యమైన ఆప్యాయతను చూసి రేమద్దుల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.