KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిసెంబర్ 9ని ‘విజయ్ దివస్’గా అభివర్ణించారు. తుది దశ తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు ఈ రోజునే తొలి అడుగు పడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో.. నాటి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష విరమిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గొప్ప చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ 9వ తేదీకి నేటితో సరిగ్గా 16 ఏళ్లు పూర్తవుతుంది. ఈ రోజున, సబ్బండ వర్గాల ప్రజలంతా కలిసి చేసిన అద్భుతమైన పోరాటం, వందలాది మంది అమరుల నిస్వార్థ త్యాగం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె.సి.ఆర్ చేసిన నిరవధిక నిరాహార దీక్ష… ఈ మూడు అంశాలు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నానికి దక్కిన తొలి విజయం.
కేటీఆర్ ఈ సందర్భంగా ఉద్యమ ముఖ్యమైన తేదీలను ప్రస్తావిస్తూ, వాటి మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. నవంబర్ 29 ‘దీక్షా దివస్’ లేకపోతే, డిసెంబర్ 9 ‘విజయ్ దివస్’ ఉండేది కాదన్నారు. అలాగే, డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడకపోయి ఉంటే, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదని అన్నారు. ఈ మూడు తేదీలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, తెలంగాణ చరిత్రలో వాటికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విజయానికి కారణమైన కేసీఆర్ పట్టుదల, ప్రజల పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు.
