Telangana Vision Document 2047: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ దార్శనిక పత్రం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసింది. ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ అనే శీర్షికతో 83 పేజీలతో రూపొందించబడిన ఈ విజన్ డాక్యుమెంట్, రాష్ట్రాన్ని కేవలం పొరుగు రాష్ట్రాలతో కాకుండా, అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీపడే గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది.
2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం
ఈ డాక్యుమెంట్ యొక్క ప్రధాన ఆర్థిక లక్ష్యం చాలా ఉన్నతమైనది. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల (One Trillion Dollar) స్థాయికి చేర్చాలని, అంతిమంగా 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ($3 ట్రిలియన్) ఆర్థిక శక్తిగా తెలంగాణను నిలపాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ లక్ష్యంతో పాటు, దేశ జీడీపీ (GDP)లో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత మరియు పర్యావరణ సుస్థిరత సాధించడంపై ఈ పత్రం దృష్టి సారించింది.
అభివృద్ధికి 3 రీజియన్స్ కాన్సెప్ట్
రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, విజన్ డాక్యుమెంట్ భౌగోళిక ప్రాంతాలను మూడు ప్రధాన రీజియన్లుగా విభజించింది.
- కోర్ అర్బన్ రీజియన్: దీనిని సేవలు, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లుగా ఉన్న నగర జీడీపీని 600 బిలియన్ డాలర్లకు పెంచాలనేది ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్, నీటి కొరత, వరదలు, పర్యావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ, హైదరాబాద్‌ను ప్రపంచంలోని పది అగ్రగామి ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్దేశించారు.
- పెరి అర్బన్ రీజియన్: ఈ ప్రాంతాన్ని పరిశ్రమలు, తయారీ రంగం (Manufacturing Hub)కు కేంద్రంగా మారుస్తారు. ORR (ఔటర్ రింగ్ రోడ్డు), RRR (రీజినల్ రింగ్ రోడ్డు) మధ్య భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంతో తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరగనున్నాయి.
- రూరల్ రీజియన్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని డాక్యుమెంట్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: KTR: డిసెంబర్ 9.. తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగు!
గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రణాళికలు
కోర్ అర్బన్ రీజియన్‌లో చేపడుతున్న ప్రణాళికలు హైదరాబాద్‌ను భవిష్యత్తు నగరం (Future City)గా మారుస్తాయి.
- మొబిలిటీ సిటీ: నగర భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసులను అనుసంధానిస్తూ సమీకృత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ప్రయాణికుల కోసం ‘కామన్ మొబిలిటీ కార్డు’ను అందుబాటులోకి తెస్తారు. అంతేకాకుండా, నగరవ్యాప్తంగా 1,000 కి.మీ.ల వాకింగ్, సైక్లింగ్ కారిడార్లు నిర్మించనున్నారు.
- బ్లూ-గ్రీన్ హైదరాబాద్- 2047: ఈ ప్రణాళికలో భాగంగా మూసీ నది పునరుజ్జీవం (Moosi Riverfront) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 35-40 కి.మీ. పొడవునా మూసీని అంతర్జాతీయ స్థాయిలో సుందరీకరించి, వాటర్ ట్యాక్సీ డాక్స్, జెట్టీలు, వంతెనలతో కొత్త రూపు ఇవ్వనున్నారు. 100 చెరువులను సుందరీకరించడం, హుస్సేన్‌సాగర్ 2.0 ప్రణాళికను అమలు చేయడం, 24 గంటలు తాగునీటి సరఫరా చేయడం ఈ విజన్‌లో ముఖ్యమైన అంశాలు.
- హెరిటేజ్ అండ్ నైట్ ఎకానమీ: చారిత్రక వారసత్వ సంపదను కాపాడడం, పాతబస్తీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా సాధించడం లక్ష్యం. నగరంలో నైట్ ఎకానమీ (Night Economy)ని పెంచేందుకు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్, ఐటీ కారిడార్లలో 24 గంటలు పనిచేసేలా హ్యాకర్స్ సెంటర్స్ 2.0 వంటి ఆధునిక మార్కెట్లను ఏర్పాటు చేస్తారు.
ఈ విజన్ డాక్యుమెంట్‌లో ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు వంటి బహుళ ప్రణాళికలను పొందుపరిచారు. సమగ్ర మౌలిక వసతుల కల్పన, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఈ విజన్ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
