KTR: తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. గోదావరి నీటిని పంపింగ్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ప్రకృతి వల్ల వచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రజలపై రుద్దిన “కృత్రిమ కరువు” అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణలోని ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, అసలు దేవాదుల ఎక్కడుందో, నల్లమల ఎక్కడుందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం అజ్ఞానం!
మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని సులభంగా లిఫ్ట్ చేయవచ్చని కేటీఆర్ వివరించారు. గోదావరి నది ద్వారా రోజుకు 9 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఆ నీటిని గనుక లిఫ్ట్ చేస్తే తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లను నింపవచ్చని చెప్పారు. తాము కన్నెపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందని, అందుకే గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని, భద్రాచలం రాముడి గుడి మునిగిపోతుందంటూ కొత్త కథలు చెప్తున్నారని మండిపడ్డారు. గతంలో భారీ వరదలు వచ్చినా మేడిగడ్డ తట్టుకుని బలంగా నిలబడిందని, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు కూడా ఎలాంటి నష్టం జరగలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
రాజకీయాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు!
“మాపై ఏవైనా కక్షలు ఉంటే కేసులు పెట్టుకోండి.. కానీ అన్నదాతలను మాత్రం ఇబ్బంది పెట్టకండి” అని కేటీఆర్ హెచ్చరించారు. మీ సొంత రాజకీయాల కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం సరికాదన్నారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రాలతో పోరాడతారని, కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సొంత రాష్ట్ర రైతుల ప్రయోజనాలనే పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని తప్పుబట్టారు. ఎప్పుడూ తన సొంత ఊరైన అనుముల (కొడంగల్ నియోజకవర్గం) గురించే కాకుండా, పక్కనే ఉన్న అన్నారం ప్రాజెక్టు గురించి కూడా పట్టించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
