Harish Rao

Harish Rao: షాబాద్ ఆరుగురి హత్యలు ప్రభుత్వ హత్యలే!.. ఆమె పేరుతో రూ.కోటి FD చేయాలి

Harish Rao:  షాబాద్‌ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణంగా హత్యకు గురికావడం అత్యంత హృదయ విదారకమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఈ దారుణ ఉదంతం ముమ్మాటికి ‘పోలీసుల హత్యలు, ప్రభుత్వ హత్యలే’ అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై మే 16నే సదరు మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పోలీసులు అవినీతికో లేక ఒత్తిడికో లొంగిపోయి.. ఫోక్సో (POCSO) కేసు నిందితుడికి 7 ఏళ్ల లోపు మాత్రమే శిక్ష పడేలా తక్కువ సెక్షన్లు పెట్టారని ధ్వజమెత్తారు. దాదాపు నెల రోజుల పాటు నిందితుడు బయట తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారని, ఆ గ్యాప్‌లోనే అతను కోర్టు నుండి ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) తెచ్చుకుని, స్టేషన్‌లో లొంగిపోయి.. ఇవాళ ఏకంగా ఆరు ప్రాణాలు తీశాడని హరీష్ రావు మండిపడ్డారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. నైతిక విలువలు ఉంటే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘోరం జరిగితే ముఖ్యమంత్రి కనీసం సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించలేదని, ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక ఎస్ఐ (SI)ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని.. రోజువారీ కేసులను రివ్యూ చేయాల్సిన పోలీస్ కమిషనర్, డిజిపి మరియు హోంశాఖ సలహాదారు శివధర్ రెడ్డిలు అప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు తమ అసలు విధులను పక్కనబెట్టి, ల్యాండ్ సెటిల్‌మెంట్లు మరియు ప్రతిపక్ష నేతలను వేధించడానికే పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చుకున్నారని ఆరోపించారు.

ఈ ఘోరకలిలో ఆ సర్వస్వం కోల్పోయిన కుటుంబంలో ప్రస్తుతం ఒకే ఒక్క ఆడపిల్ల ప్రాణాలతో మిగిలిందని, ఆమె పరిస్థితి తలుచుకుంటేనే గుండె చెరువవుతోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మిగిలిన అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు, రెండు కాళ్లు లేవు (మూగ, చెవిటి దివ్యాంగురాలు). ఆ అమ్మాయికి అన్నం తినిపించాలన్నా, వాష్‌రూమ్‌కు తీసుకువెళ్లాలన్నా ఆ కుటుంబ సభ్యులే అన్ని చూసుకునేవారని.. ఇప్పుడు అందరూ చనిపోవడంతో ఆమె ఒంటరిదైపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణమే మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆ దివ్యాంగురాలైన అమ్మాయి పేరు మీద రూ.1 కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయాలని, అలాగే ఆమెను పెంచి పెద్ద చేసే పూర్తి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బాధితులను ఓదార్చడానికి, పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మ దేవేందర్ రెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు ఇళ్ల వద్దే ప్రత్యేక బృందాలతో అరెస్ట్ చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురిని పొట్టనబెట్టుకున్న హంతకుడిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ వేయని పోలీసులు.. పరామర్శకు వెళ్లే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి అరెస్ట్ చేయడానికి మాత్రం టీమ్‌లను పెడుతున్నారని దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని, పరారీలో ఉన్న హంతకుడిని వెంటనే పట్టుకుని కఠినాతి కఠినంగా శిక్షించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *