Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల కేసుపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా వాడుతున్నారనే ఫిర్యాదుతో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని, తన ఇమేజ్‌ను వాణిజ్య ప్రయోజనాలకు తప్పుడు రీతిలో ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, సోషల్ మీడియా కంపెనీలు మరియు ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చే ఫిర్యాదులపై తప్పనిసరిగా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సమాచార సాంకేతిక నిబంధనలు–2021 ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు అందిన మూడు రోజుల్లోపే అక్రమ కంటెంట్‌ను తొలగించాలని స్పష్టం చేసింది.
ప్లాట్‌ఫారమ్‌లపై జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఫోటో, రూపం, గళం లేదా వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ అంశాన్నైనా వాణిజ్య లేదా మోసపూరిత ప్రయోజనాల కోసం వాడితే, అలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాల్సిన బాధ్యతను కోర్టు గుర్తు చేసింది. ప్రముఖుల వ్యక్తిత్వ హక్కులను రక్షించడంలో ఇది ఒక ముఖ్యమైన ఆదేశంగా భావిస్తున్నారు.
విచారణను హైకోర్టు డిసెంబర్ 22కి వాయిదా వేసింది. ఆ రోజున ఈ కేసుపై మరింత సవివరమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు జస్టిస్ అరోరా తెలిపారు.

