Pawan Kalyan: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించారు. ఇక్కడి శ్రీశారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో ముఖాముఖి చర్చలు జరిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విద్యారంగంలో పీటీఎం కీలకమైన మార్పులు తీసుకువస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చిలకలూరిపేటను ఎంచుకున్నామని తెలిపారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు తప్పకుండా దృష్టి సారించాలని ఆయన కోరారు.
లోకేశ్ ఆలోచన అద్భుతం
ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి నారా లోకేష్ ఆలోచనను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభినందించారు. “విద్యారంగంలో ఈ పీటీఎం సమావేశాలు నిర్వహించాలన్న లోకేశ్ ఆలోచన అద్భుతం. మా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఆయన ఉపాధ్యాయుల పాత్రను ప్రశంసిస్తూ, అధ్యాపకులను మనం దైవంతో సమానంగా భావిస్తాం. వారు పాఠాలతో పాటు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు, అని తెలిపారు. విద్యార్థులు తమ మధ్య గొడవల్లోకి రాజకీయాలను లాగొద్దని ఆయన సూచించారు.
Also Read: Danam Nagender: దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా
స్కిల్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత
పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానంలో ‘నైపుణ్యాధారిత అభ్యాసం’ (Skill Based Learning) ఉండాలని తాను ప్రధానమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. అలాగే, జనసేన నేతలు తమ ప్రాంతాల్లోని పిల్లల కోసం గ్రంథాలయాల సదుపాయాలను కల్పించాలని సూచించారు.
సమావేశంలో విద్యార్థులు తమకు క్రీడా మైదానం సరిపోవడం లేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, దానిపై ఉన్నతాధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని పవన్ మెచ్చుకున్నారు.
విద్యార్థుల ఆలోచనలు మెరుగుపడటానికి గ్రంథాలయం ఎంతో అవసరమని పేర్కొన్న పవన్ కళ్యాణ్, శ్రీశారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదనంగా, ఆ పాఠశాలకు 25 కంప్యూటర్లు అందజేస్తానని ప్రకటించారు.

