Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోరాడడం, గెలవడం అనేది తన రక్తంలోనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా, తనపై ఉన్న అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ చాలా స్పష్టంగా స్పందించారు.
తన రాజీనామా గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించలేదని దానం నాగేందర్ తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గనుక ఆదేశిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి తాను ఏ మాత్రం వెనుకాడనని ప్రకటించారు. ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని, ఇప్పటివరకు ఏకంగా 11 సార్లు పోటీ చేసిన చరిత్ర తనకు ఉందని ఆయన గుర్తు చేశారు. అనర్హత అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, అక్కడ తన వాదనలను బలంగా వినిపిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కూడా దానం నాగేందర్ ప్రశంసలు కురిపించారు. రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ‘రైజింగ్ తెలంగాణ’ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్‌ను చాలా విజయవంతంగా నిర్వహిస్తోందని ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.

