Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. తిరుపతి వద్ద దామినేడు జాతీయ రహదారి గుండా ఆయన కాన్వాయ్ వెళుతుండగా, వర్షంలో తడుస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎదురుచూస్తున్న రైతులను చూశారు. వారిని గమనించిన వెంటనే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కాన్వాయ్‌ను ఆపించి, రైతుల వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలను ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఆలకించారు.
రైతులు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారు ప్రధానంగా తమ భూమి సమస్య గురించి వివరించారు. 1961వ సంవత్సరంలో ప్రభుత్వం ‘ఎస్టేట్ అబోలిషన్ యాక్ట్’ కింద తమ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని తెలిపారు. అయితే, 1962లో జరిగిన సర్వే సమయంలో పొరపాటు జరిగింది. ఆ సర్వే కారణంగా, దాదాపు 175 ఎకరాల భూమి ‘అనాధీన భూములుగా అంటే ఎవరికీ చెందనట్లుగా రికార్డుల్లో నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం ఇనాం ఎస్టేట్‌గా ఉన్నప్పటి నుంచి తమ 26 కుటుంబాలు శిస్తులు చెల్లిస్తూ, ఎలాంటి గొడవలు లేకుండా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని పవన్ కల్యాణ్‌కు తెలిపారు.
దశాబ్దాలుగా తమ అనుభవంలో ఉన్న ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వేడుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధించిన దరఖాస్తు పత్రాలను ఆయనకు అందజేశారు. రైతుల విన్నపాన్ని పూర్తిగా విన్న పవన్ కల్యాణ్, వారికి తక్షణమే భరోసా ఇచ్చారు. ఈ సమస్య గురించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, తగు చర్చలు జరిపి త్వరగా పరిష్కారం తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

