KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల కోసం గతంలో తక్కువ ధరకే కేటాయించిన విలువైన భూములను ఇప్పుడు కొత్త ప్రభుత్వం తప్పుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ భూముల విలువ ప్రస్తుతం భారీగా పెరిగిందని ఆయన చెప్పారు.
కుత్బుల్లాపూర్ పర్యటనలో భాగంగా, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో దాదాపు రూ. 75 వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని కేటీఆర్ మీడియాకు తెలిపారు. ఈ భూములను పేదల కోసం ఇళ్లు కట్టడానికి, పాఠశాలలు నిర్మించడానికి ఉపయోగించవచ్చు. కానీ, ప్రభుత్వం అవేమీ చేయడం లేదని, కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలం కేటాయించలేని పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. కాలుష్యం తగ్గించాలనే ఆలోచన మంచిదే అయినా, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపడానికే అని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ ధర కూడా కాకుండా, రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం మాత్రమే తీసుకుని భూములను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం అని ఆరోపించారు.
ఈ సందర్భంగా, పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ గట్టి హెచ్చరిక చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ “ఆషాఢ సేల్” లాంటి ఆఫర్ను చూసి మోసపోవద్దని కోరారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ భూములను తీసుకున్నట్లయితే, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే చట్టం తీసుకొచ్చి ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ భూ కుంభకోణంలో భాగం కావద్దని పరిశ్రమల యజమానులను ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “అవినీతి అనకొండ” అని విమర్శిస్తూ, ఢిల్లీకి డబ్బు మూటలు పంపడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో, పేదల ఇళ్ల కోసం లేదా కాలుష్యం లేని పరిశ్రమల కోసం మాత్రమే ఉపయోగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, న్యాయస్థానాల్లో పోరాడతామని తెలిపారు. దీనిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిల పక్ష సమావేశాలు పెడతామని ప్రకటించారు. పేదల గుడిసెలు తొలగిస్తూ, పెద్దలకు మాత్రం విలువైన భూములు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ఈ “హిల్ట్” భూముల విషయం ఒక ఆరంభం మాత్రమేనని, కార్మిక సంఘాలతో కలిసి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ గట్టిగా చెప్పారు.

