Sabarimala

Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. 10 ప్రత్యేక రైలు సర్వీసులు

Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబరు 13 నుంచి జనవరి 2 వరకు మొత్తం 10 ప్రత్యేక రైలు సర్వీసులు భక్తుల ప్రయాణానికి అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి శబరిమల దారిలో ఉన్న కేరళ రాష్ట్రంలోని కొల్లం జంక్షన్‌కు ఈ రైళ్లు చేరుకుంటాయి. పండుగ సీజన్ కారణంగా సాధారణ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టమవుతుండటంతో, భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలి అని నిర్ణయించింది.

డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసుల టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. భక్తులు ముందుగానే తమ ప్రయాణ తేదీలను అనుసరించి టికెట్లు రిజర్వు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి కొల్లంకు వెళ్లే రైలు డిసెంబరు 13న బయల్దేరుతుంది. ఈ రైలు మార్గమధ్యంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతూ, తరువాత విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లం చేరుతుంది.

Also Read: AP TET: ఏపీలో టెట్ షెడ్యూల్.. ఈ నెల 10 నుండి రెండు విడతల్లో పరీక్షలు ప్రారంభం

చర్లపల్లి నుంచి కొల్లంకు వెళ్లే ప్రత్యేక రైళ్లు డిసెంబరు 17, 20, 31 తేదీల్లో బయల్దేరనున్నాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు మీదుగా గుంతకల్ — చిత్తూరు — కాట్పాడి రూట్‌లో కేరళ దిశగా సాగుతాయి. హజూర్‌సాహిబ్‌ నాందేడ్ నుంచి కొల్లంకు రైళ్లు డిసెంబరు 24న ప్రయాణం మొదలవుతుంది. ఈ రైలు నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్లి, విజయవాడ, తిరుపతి, కొట్టాయం చేరిన తర్వాత కొల్లం స్టేషన్‌కు చేరుతుంది.

కొల్లం నుంచి తిరిగి చర్లపల్లికి డిసెంబరు 15, 19, 22, 26 తేదీల్లో,  జనవరి 2న ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. భక్తుల ప్రయాణానికీ, రద్దీ తగ్గించడానికీ ఈ రైళ్లు పెద్ద సహాయంగా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. శబరిమల సీజన్‌లో ప్రయాణించే వారు ముందుగానే ప్లాన్‌ చేసుకుని రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *