Local Body Polls: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రక్రియలో భాగంగా, డెడికేటెడ్ కమిషన్ (Dedicated Commission)తన కీలకమైన రిజర్వేషన్ల నివేదికను ఈ రోజు (గురువారం) ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదికతో ఎన్నికల దిశగా మరో ముఖ్య అడుగు పడినట్లవుతుంది.
50% రిజర్వేషన్ల లెక్క తేలింది!
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగానే, ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ పూర్తి చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వర్ రావు నేడు ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నివేదికలో సర్పంచ్లు, వార్డు మెంబర్స్ రిజర్వేషన్ల లెక్కలను కమిషన్ పకడ్బందీగా ఖరారు చేసింది. ప్రభుత్వం ఈ నివేదికకు ఆమోదం తెలిపి, వెంటనే జిల్లాలకు పంపనుంది. కమిషన్ సూచించిన లెక్కల ప్రకారమే వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
ఇది కూడా చదవండి: Kavitha: సింగరేణి భవన్ వద్ద ఉద్రిక్తత.. కవిత అరెస్ట్
ఎన్నికల సంఘానికి గెజిట్, హైకోర్టులో అఫిడవిట్
డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే, ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ను ఎన్నికల సంఘానికి (Election Commission) అందజేయనున్నారు. ఇదే సమయంలో, పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రభుత్వం ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి అధికారిక లేఖ ఇవ్వనుంది. ఆ తర్వాతే, ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నేడో, రేపో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఈ అఫిడవిట్లో..
మూడు వారాల్లోపు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ఇస్తామని.ఎన్నికల నిర్వహణకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని. ప్రభుత్వం కోర్టుకు తెలియజేయనుంది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ముందుకు సాగనుంది.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. హైకోర్టు తీర్పు, ఎన్నికల సంఘం షెడ్యూల్ కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

