Hyderabad: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, నగరంలో అత్యంత పేరుగాంచిన హోటల్స్ అయిన పిస్తా హౌస్, షా గౌజ్ యజమానుల నివాసాలు, కార్యాలయాలలో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ మెరుపు దాడుల్లో దాదాపు 50కి పైగా టీమ్స్ పాల్గొంటున్నాయి. ఉదయం నుంచే హోటల్ యజమానుల ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థలతో సహా పలు కీలక ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు మరియు అక్రమ ఆస్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ దాడుల పూర్తి వివరాలు తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

