Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సర్కారు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన వెల్లడిస్తుందని అందరూ భావిస్తున్నారు.
Local Body Elections: ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 24లోగా, ఎన్నికల నిర్వహణపై డిసెంబర్ 3వ తేదీలోగా రాష్ట్ర హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. అందుకే ఆ లోగానే ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు నోట్ఫైల్ను రూపొందించింది.
Local Body Elections: ఈ నేపథ్యంలో నవంబర్ నెలలోనే పరిషత్, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం వెలువరించే అవకాశం ఉన్నది. డిసెంబర్ నెలలోగా రెండు లేదా మూడు విడతల్లోగా అటు పరిషత్, ఇటు పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఒక అంగీకారానికి అయితే ప్రభుత్వం వచ్చింది. దీనికోసం కసరత్తు కూడా చేపట్టింది. కేవలం రిజర్వేషన్ల అంశం ఒక్కటే మార్చాల్సి ఉంటుంది.
Local Body Elections: ఈ దశలో మున్సిపల్ ఎన్నికలపైనా రాష్ట్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. జనవరి లేదా ఫిబ్రవరిలోగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయా మున్సిపల్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 144 మున్సిపాలిటీలకు గాను 139 మున్సిపాలిటీలకు గడువు ముగిసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 13 పాలకవర్గాల గడువు ముగిసి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో మొత్తంగా 160 పురపాలికల ఎన్నికలను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నది.

