Telangana: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచి టీఎంసీలో చేరిన ఓ ఎమ్మెల్యేపై కలకత్తా హైకోర్టు అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు దారితీసింది. స్పీకర్లు జాప్యం చేస్తే జరిగే పరిణామాలపైనా న్యాయస్థానాలు తగిన రీతిలో స్పందిస్తాయన్న విషయం తేటతెల్లమైంది.
Telangana:బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముకుల్ రాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోకి వెళ్లారు. దీనిపై బీజేపీ నాయకులు పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌ను ఆశ్రయించారు. స్పీకర్ వద్ద తాను బీజేపీ పార్టీలోనే ఉన్నట్టు నటించారు. దీంతో పార్టీ ఫిరాయింపు జరగలేదని తేల్చారు.
Telangana:ఇదే సమయంలో ముకుల్ రాయ్ తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఎంసీలో చేరారని, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్న పలు ఆధారాలతో బీజేపీ నాయకులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. కీలక ఆదేశాలను జారీచేసింది.
Telangana:రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న రూల్స్ ఆఫ్ 1986 కింద.. ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని, పీఏసీ నామినేషన్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ అంశం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అలజడిని రేపింది. ఇప్పటికే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంపై ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతున్నది.
Telangana:ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ చేపడుతున్నారు. నలుగురి విచారణ పూర్తవగా, మరో ఇద్దరిని విచారిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మళ్లీ సుప్రీం కోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువును స్పీకర్ మీరారని, న్యాయస్థానం సరైన చర్య తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ 8 మంది సభ్యులంతా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ చెప్పుకుంటున్నారు.
Telangana:ఆ 10 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కడియం శ్రీహరి ప్రచారంలో పాల్గొన్నారు. అందుకే వీరిద్దరిపై వేటు తప్పదని భావిస్తున్నారు.
Telangana:వీరిద్దరితోపాటు మరో అభ్యర్థిని పీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేయకున్నా ప్రభుత్వం ఎన్నిక చేసింది. దీంతో వీరు ముగ్గురి అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. మిగతా వారి పరిస్థితి కూడా అయోమయంలో పడింది. కలకత్తా హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇదే దశలో నవంబర్ 17న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటం గమనార్హం.

