Presidents for ATP TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, బలగం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్పీప్ చేస్తూ సైకిల్ హవా నడిచింది. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే దూకుడు కంటిన్యూ చేయాలని టీడీడీ అధిష్టానం భావిస్తోంది. ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నెరవేర్చగల జిల్లా అధ్యక్షుల కోసం తీవ్ర కసరత్తే చేసింది. సుదీర్ఘంగా 5 నెలలుగా రథసారథుల ఎంపిక విషయంలో కుల ఈక్వేషన్లతో పాటు ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి అన్నింటినీ భేరీజు వేసుకుంది. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్లను అధిష్టానం ఫైనల్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి జిల్లాకు రథసారథిగా మరింత బలమైన వ్యక్తిని నియమిస్తే, పార్టీని గ్రౌండ్ లెవెల్‌లో మరింత బలంగా తీసుకెళ్లగలరని అధిష్టానం భావించింది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి అనేకమంది ఆశావహులు పోటీపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత అధ్యక్షులు అంజనప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పోటీలో నిలిచారు. అయితే అధిష్టానం కొత్త ఈక్వేషన్స్ తెరమీదకు తీసుకొచ్చింది. ఎస్సీ సామాజికవర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ వాయిస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగల సమర్థుడిగా ఎమ్‌ఎస్ రాజుకు పేరుంది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షునిగా వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై ఒక యుద్ధమే చేశారు ఎమ్మెస్ రాజు. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రారంభమైనప్పుడు.. ప్రభుత్వానికి ఎదురు నిలిచి, పోలీసులు, వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలువరిస్తూ పాదయాత్రను ముందుకు నడిపారు ఎమ్మెస్ రాజు. ఆనాటి నుంచే యువనేత లోకేష్‌కు టీమ్ మెంబర్‌గా మారిపోయారు ఎమ్మెస్ రాజు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వం అందించిన సూపర్ సిక్స్ పథకాలతోపాటు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ రాజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగరని అధిష్టానం నమ్ముతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం హిందూపూర్ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా దాదాపు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేరును ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: Anagani Satya Prasad: పేదలకు సెంటు స్థలం.. జగన్ మాత్రం ప్యాలెస్‌లో
ఇక అనంతపురం పార్లమెంటు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీలో నిలిచారు. సీనియర్లు, జూనియర్లు, కమ్మ, రెడ్డి, బలిజ, బీసీ నాయకులు.. ఇలా అన్ని వర్గాల నుండి పోటీ ఎక్కువగా కనబడింది. అధిష్టానం మాత్రం కుల సమీకరణాలతో పాటు నేతల ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నారట. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి, ఎంపీ, మండల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే నాయకుడి కోసం అన్వేషించింది టీడీపీ హైకమాండ్. మరో నాలుగు నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినట్టుగా లోకల్ బాడీల్లో కూడా అదే దూకుడు చూపాలని సైకిల్ పార్టీ తహతహలాడుతోంది. అది జరగాలంటే… కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలను కలుపుకుని ముందుకు నడిపించే నాయకుడికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తేనే అది సాధ్యమవుతుందని అధిష్టానం ఆలోచన. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని సమాచారం. జిల్లాలో అందర్నీ సమన్వయం చేసుకుంటూ నడిపే శక్తి-సామర్థ్యం, అందర్నీ కలుపుకుపోయే బీసీ నాయకుడిగా మంచి పేరుంది కాల్వ శ్రీనివాసులుకు. అనంతపురం పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ హ్యాండిల్ చేయాలంటే సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు వల్లే సాధ్యమవుతుందని అధిష్టానం భావిస్తోందట. అయితే కాల్వ శ్రీనివాసులు మాత్రం జిల్లా అధ్యక్ష పీఠం చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదట. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జిల్లా అధ్యక్ష పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ. ఎంఎస్ రాజు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే నాయకుడిగా, కాల్వ శ్రీనివాసులు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే సామర్థ్యం ఉన్న నాయకుడిగా పేరుంది. వీరిద్దరూ జిల్లాలకు అధ్యక్షులైతే లోకల్ బాడీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ ఆలోచిస్తోంది. దాదాపు వీరిద్దరి పేర్లే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. చూడాలి మరి, ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షులుగా వీరి పేర్లనే అనౌన్స్ చేస్తారా? లేదా చివరి నిమిషంలో మార్పులు-చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే మాత్రం అధిష్టానం ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

