Jubilee Hills By-Election: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఓటింగ్ మొదలై చాలా సమయం అయినప్పటికీ, ఓటర్లు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేవలం 20.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. దేశంలోని మిగతా నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఓటింగ్ ప్రక్రియ ఇలా నెమ్మదిగా కొనసాగితే, మొత్తం పోలింగ్ శాతం మరింత తగ్గే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ముఖ్యంగా వెంగళ్‌రావు నగర్, మధురా నగర్ వంటి ఏరియాల్లో ఓటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు, దాని గురించి అధికారులు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఉప ఎన్నికలో ఓటు వేయడానికి ఓటర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.

