Ayyanapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చండీయాగ, నవగ్రహయాగాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్‌కు అధికారమే తెలుసు తప్ప పరిపాలన గురించి ఏమాత్రం తెలియదని విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస పాలనగా అభివర్ణించిన అయ్యన్నపాత్రుడు, పూర్వకాలంలో రాజులు రాక్షసుల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు యాగాలు నిర్వహించేవారని, ఆ తరహాలోనే రాష్ట్రం గత పాలనలో బాధపడిందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తమ మూర్ఖత్వంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, రాష్ట్ర ఖజానాను దోచుకుని భారీ అప్పులు మిగిల్చారని మండిపడ్డారు.
అతను ఇంకా మాట్లాడుతూ, దుర్మార్గులు మరియు రాజకీయాలంటే అర్థం తెలియని వారు రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టి రాష్ట్రాన్ని రక్షించారని, ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వైసీపీ నేతలు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
జగన్ ప్రస్తుతం కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎమ్మెల్యేకు ఉన్న సమయమే ఇస్తామని స్పష్టం చేశారు. కానీ, “అధ్యక్షా” అని పిలవాల్సి రావడం ఇష్టం లేకపోవడమే జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణమని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

