Lesbian: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరియు ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి తమ ఐదు నెలల పసికందును హత్య చేశారని భర్త ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.నవంబర్ 5వ తేదీన కృష్ణగిరి జిల్లా, చిన్నట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాలు తాగుతుండగా శిశువు అపస్మారక స్థితికి చేరుకోవడంతో, వెంటనే కేలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు మరణించినట్లు వైద్యులు ప్రకటించగా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు.
శిశువు మరణంపై అనుమానం వచ్చిన తండ్రి, సురేష్, తన భార్య భారతిపై అనుమానం పెంచుకున్నాడు. సురేష్, భారతి మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అందులో భారతికి ఆమె భాగస్వామి సుమిత్రతో ఉన్న ఫోటోలు, వాయిస్ మెసేజ్‌లు లభించాయి. ఈ ఆధారాలు తన కొడుకును ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని సూచించడంతో, సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
సురేష్ పోలీసులకు అందజేసిన రికార్డు చేసిన ఫోన్ సంభాషణలో… భారతి శిశువును చంపినట్లు అంగీకరించినట్లుగా సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, భారతి, సుమిత్ర గత మూడేళ్లుగా లెస్బియన్ సంబంధంలో ఉన్నారు. భారతికి బిడ్డ పుట్టిన తర్వాత, ఇద్దరూ కలిసి గడపడానికి సమయం దొరకకపోవడంతో వారి సంబంధంలో సమస్యలు తలెత్తాయి. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే పసికందును హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేష్ ఫిర్యాదు అందించిన సాక్ష్యాల ఆధారంగా, కేలమంగళం పోలీసులు భారతి, సుమిత్రలను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీసింది.

