Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన ఆయన, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
పాలనలో రెండేళ్లు – కాంగ్రెస్ పాత్ర
ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లయిన సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర, తెలంగాణ అభివృద్ధిలో దాని పాత్రను గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఐటీ, ఫార్మా స్పెషల్ హబ్‌గా మారిందని గుర్తు చేశారు. ఫార్మా, ఐటీలో అగ్రగామి కంపెనీలు, మూడు కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారయ్యాయని అన్నారు. “ప్రపంచాన్నే శాసించే అంశాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పాలసీలే తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌గా మారాయి” అని పేర్కొన్నారు. వృద్ధిరేటులో రంగారెడ్డి జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. “ఇవన్నీ కేసీఆర్ చెరిపేస్తే చెరిగిపోయేవి కావు” అని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను, తమ రెండేళ్ల పాలనతో పోల్చవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి, రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీశారు” అని ఆరోపించారు. సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్‌తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. “రూ. 20 లక్షల కోట్లతో నికరంగా ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?” అని నిలదీశారు. వందేళ్లు పూర్తైన ఉస్మానియా ఆస్పత్రిని కూడా కట్టలేదని విమర్శించారు. ఎర్రగడ్డ, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆస్పత్రులను ఏడాదిన్నరలోగా పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం లేకున్నా, దేశంలోనే అత్యధికంగా వరి దిగుబడి వచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరి ఉత్పత్తి లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తూ అగ్ర నటి శ్రీలీలతో పోల్చారు. సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఉన్నట్టు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్‌కు, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి తేడా లేదు అని సంచలనం సృష్టించారు. “కేటీఆర్ దశనే సక్కగా లేదు, దిశ ఎట్లా మారుస్తాడు” అని ఎద్దేవా చేశారు. “సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించినవాడు మహిళలకు రక్షణగా ఉంటాడా?” అంటూ మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ ఉన్న వివాదాన్ని ప్రస్తావించారు.
కిషన్ రెడ్డికి సవాల్
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. “కిషన్‌రెడ్డి, గుజరాత్‌కి ఎన్నాళ్లు గులాంగా ఉంటావు? తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా? తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించవు?” అని ప్రశ్నించారు.“కిషన్‌రెడ్డి.. కేటీఆర్‌తో బ్యాడ్ సోపతి వదులుకో” అని సలహా ఇచ్చారు.
పాలన విజయాలు
తాము అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులను రేవంత్ రెడ్డి వివరించారు:
- రైతు భరోసా పెంచాం, షాదీముబారక్ కొనసాగించాం.
- దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం.
- రూ. 9 వేల కోట్లతో రైతు భరోసా ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం.
- రూ. 500లకే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాం.
- బీఆర్‌ఎస్ ఇచ్చిన పథకాలు ఆపకుండా కొనసాగించాం.
- 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.
- మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకున్నవారు, వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుగా పడుకోలేదు? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

