Bengaluru Crime News: అద్దెకు తీసుకున్న పాపానికి ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిన దారుణ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. టీవీ చూసే నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన అద్దె దంపతులు, ఇంటి ఓనర్‌ను దారుణంగా హత్య చేసి మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారు. సోమవారం (నవంబర్ 03) జరిగిన ఈ హత్య కేసును బెంగళూరు పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు.
ఘాతుకానికి పాల్పడిన అద్దె దంపతులు
హత్యకు గురైన మహిళ శ్రీలక్ష్మి (65). ఆమె భర్త అశ్వత్ నారాయణ్ కాటన్‌పేట్‌లోని ఒక అగరుబత్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరు ఉత్తరహళ్లిలోని న్యూ మిలీనియం స్కూల్ రోడ్డులో నివసిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ శ్రీశైల్ (26), అతని భార్య సాక్షి హనమంత (23). వీరు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సాక్షి పద్మనాభనగర్ జువెలరీ షాపులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండగా, భర్త కూలీ పని చేస్తాడు.
ఇది కూడా చదవండి: Hookah Flavours: మోస్ట్ వాంటెడ్ అరెస్ట్.. ముంబైలో 3 కోట్ల హుక్కా ఫ్లేవర్స్ పట్టివేత
అశ్వత్ నారాయణ్ ఇంట్లో లేని సమయంలో, నిందితులు భార్యాభర్తలు ‘టీవీ చూస్తాం’ అని చెప్పి శ్రీలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను దిండుతో మోది దారుణంగా చంపేసి, మెడలో ఉన్న మంగళసూత్రాన్ని (తాళిని) ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన భర్త నారాయణన్, భార్య మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీలక్ష్మి మెడ, పెదవులు, ముఖంపై గాయాలు ఉన్నాయి. ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులు కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది.
అప్పులు, దొంగిలించిన నగలు
పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, అనుమానాస్పదంగా ఉన్న అద్దె దంపతులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు తమ ఓనర్ నారాయణన్‌తో సహా ఆ ఏరియాలోని చాలా మందితో అప్పులు చేసినట్లు తెలుస్తోంది.
మహిళను హత్య చేసిన తర్వాత డబ్బు కోసం ఇంట్లో ప్రతీ అంగుళం వెతికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. డబ్బు కనిపించకపోవడంతో చివరికి మంగళసూత్రంతో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కిరాతక జంటను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. అద్దెకు ఇచ్చిన పాపానికి ఓ ఇంటి యజమాని ప్రాణం కోల్పోవడం ఈ సమాజంలో న్యాయానికి రోజులు లేవనే భావనను కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

