Hookah Flavours: మాదకద్రవ్యాల అక్రమ రవాణా (డ్రగ్స్ ట్రాఫికింగ్) మరియు నిషేధిత హుక్కా ఫ్లేవర్ల అక్రమ వ్యాపారంపై ముంబై పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారు. ఒకే సమయంలో క్రైమ్ బ్రాంచ్, యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) విభాగాలు రెండు వేర్వేరు ఆపరేషన్లలో కీలక విజయాలు సాధించాయి.
నిషేధిత హుక్కా ఫ్లేవర్ల భారీ స్వాధీనం
మహారాష్ట్రలో నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్నప్పటికీ, వాటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్న నేపథ్యంలో, ముంబై క్రైమ్ బ్రాంచ్ కఠిన చర్యలు చేపట్టింది. పక్కా సమాచారం ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 1 ఒక గోడౌన్‌పై దాడి చేసింది. దాడిలో 1,831 బాక్సుల నికోటిన్ కలిసిన హుక్కా ఫ్లేవర్లను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ నిషేధిత హుక్కా ఫ్లేవర్ల మొత్తం విలువ సుమారు రూ. 3.01 కోట్లుగా అంచనా వేశారు. వీటిపై చట్టబద్ధమైన ఆరోగ్య హెచ్చరికలు కూడా లేవు. ఈ మధ్యకాలంలో అక్రమ హుక్కా వ్యాపారంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Crime News: శ్రీ.. ఐయామ్ సారీ.. ఈ చీమలతో బతకడం నావల్ల కాదు..వివాహిత సూసైడ్
MD డ్రగ్స్ సరఫరాదారు అక్బర్ ఖౌ అరెస్టు
మరో ప్రత్యేక ఆపరేషన్‌లో, యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) మెఫెడ్రోన్ (MD) మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసింది. ఒడిశాకు చెందిన అహ్మద్ మొహమ్మద్ షఫీ షేక్ (అలియాస్ అక్బర్ ఖౌ). ఇతను గతంలో కూడా మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో ఉన్న పాత నేరస్థుడు.
View this post on Instagram
ఘట్కోపర్ ANC యూనిట్ గతంలో దాదాపు రూ. 12.8 లక్షల విలువైన 64 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడు ఫరీద్ రెహ్మతుల్లా షేక్ అలియాస్ ఫరీద్ చుహాను అరెస్టు చేసింది. విచారణలో ఆ మాదకద్రవ్యాలను అక్బర్ ఖౌ సరఫరా చేసినట్లు తేలింది. థానేలో MCOCA (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదు చేయబడి బెయిల్‌పై విడుదలైన అక్బర్ ఖౌ, తిరిగి మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఉన్నట్లు తేలింది. నిఘా సమాచారం మేరకు ANC బృందం అతన్ని ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్‌లో గుర్తించి నవంబర్ 1, 2025న అరెస్టు చేసింది.
అతన్ని ముంబై సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు నవంబర్ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. ANC అధికారులు ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన విస్తృత నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు.

