Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గురువారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అయిన దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
మంత్రి లోకేశ్‌కు ప్రకాశం జిల్లా సరిహద్దులో, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యతో పాటు వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా లోకేశ్ వెంట పయనించారు. కందుకూరు నియోజకవర్గంలోని తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు.
Also Read: PM Narendra Modi: టీమిండియా మహిళా జట్టుతో ప్రధాని ఏమన్నారో తెలుసా?
అయితే, ఈ స్వాగత కార్యక్రమం మధ్యలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బందోబస్తు పేరుతో పోలీసులు తమకు, కార్యకర్తలకు మధ్య అడ్డుగా నిలవడాన్ని, కార్యకర్తలను పక్కకు నెట్టేయడాన్ని మంత్రి లోకేశ్ గమనించారు. దీంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ కూడా పోలీసుల చర్యల వల్ల ఇబ్బంది పడడాన్ని చూసి, లోకేశ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. సింగరాయకొండ సీఐ హజరతయ్య, టంగుటూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
పోలీసుల జోక్యం తర్వాత, లోకేశ్ దగదర్తి గ్రామంలోని సుబ్బానాయుడు ఇంటికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుబ్బానాయుడు సేవలను కొనియాడిన మంత్రి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ ర్యాలీ సందర్భంగా మంత్రి లోకేశ్ కార్యకర్తలు, స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు.

