Balakrishna: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి అయిన నారా భువనేశ్వరికి రెండు ముఖ్యమైన అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. లండన్‌లోని మే ఫెయిర్ హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఈ విషయంపై ఆమె సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
తన చెల్లెలు భువనేశ్వరికి దక్కిన ఈ గౌరవం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని బాలకృష్ణ అన్నారు. సమాజ సేవ చేయడంలో ఆమె చూపిన పట్టుదల, మంచి విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను బాగు చేయాలనే ఆమె మానవతా దృక్పథానికి ఈ అవార్డులు గుర్తింపు అని బాలకృష్ణ మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “మా చెల్లెలు భువనేశ్వరి దూరదృష్టి, కష్టం, నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవాలు మనందరికీ ఒక మంచి ఉదాహరణ, స్ఫూర్తిని ఇస్తాయి” అని అభినందించారు. ఈ అవార్డులు భువనేశ్వరి సేవానిరతి, నాయకత్వ సామర్థ్యాన్ని, అంతర్జాతీయంగా ఆమెకు దక్కిన గుర్తింపును తెలియజేస్తున్నాయని బాలయ్య పేర్కొన్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నిర్వహించింది.

