Defensive Driving: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదానికి ప్రధానంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ (ORR) లేదా హైవేలపై వెళ్లే అధిక వేగాన్ని గ్రామీణ రహదారులపై కూడా కొనసాగించడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
రోడ్డు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు
ప్రమాదాల నివారణకు కేవలం వేగ నియంత్రణ మాత్రమే కాకుండా, డ్రైవర్లలో ‘సెన్స్ కంట్రోల్’ అవసరమని డీజీపీ సూచించారు.
రోడ్డుపై ఉన్న పరిస్థితి, ఎదురుగా వచ్చే వాహనం వేగం, రోడ్డు వెడల్పు, మలుపు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ నియంత్రణ తప్పనిసరి అన్నారు. చేవెళ్లలో మలుపు ప్రమాదం అయ్యేంత ఘాటుగా లేదని, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందని ఆయన వివరించారు.
ప్రతి డ్రైవర్‌కు సేఫ్టీ ప్రాథమిక బాధ్యత అని, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతే కఠిన చర్యలు తప్పవని డీజీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా చేవెళ్ల ఏసీపీని నియమించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు డీజీపీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ప్రమాద నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్’
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్పై అవగాహన పెంచుకోవాలని డీజీపీ సూచించారు. ఇది కేవలం డ్రైవింగ్ టెక్నిక్ కాదని, మైండ్‌సెట్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే, ‘నా వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదు, ఎవరి వల్లా నాకూ జరగకూడదు’ అనే ఆలోచనతో డ్రైవ్ చేయడం.
డిఫెన్సివ్ డ్రైవింగ్‌లో ముఖ్య అంశాలు:
ముందు వాహనం వెనుక కనీసం 3 సెకన్ల దూరం పాటించడం ద్వారా హఠాత్తుగా బ్రేక్ వేసినా ప్రమాదం నివారించవచ్చు. ఇతర వాహనదారులు ఏం చేయబోతున్నారో ముందుగానే అంచనా వేసి, వారి తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను కూడా నివారించడానికి సిద్ధంగా ఉండాలి (ఉదాహరణకు, సడన్‌గా లైన్ మార్చే వాహనం).
హైవేలు, గ్రామీణ రోడ్ల పరిస్థితిని బట్టి వేగాన్ని మార్చడం ముఖ్యం. రోడ్డు స్థితిని బట్టి వేగం మార్చడం డిఫెన్సివ్ డ్రైవింగ్‌లో కీలకం. రియర్ వ్యూ, సైడ్ మిర్రర్లను తరచూ చెక్ చేయడం ద్వారా వెనుక పరిస్థితులను గమనించడం. లైన్ మార్చేటప్పుడు లేదా టర్న్ తీసుకునేటప్పుడు ముందుగానే ఇండికేటర్ ఇవ్వడం.
పూర్తి అవగాహనతో, ఏకాగ్రతతో డ్రైవ్ చేయడం తప్పనిసరి. ట్రాఫిక్ పెరుగుతున్న ఈ కాలంలో, ఇతరుల తప్పులను కూడా ముందుగానే అంచనా వేసి రక్షించుకోవడం (Defensive Driving) ద్వారానే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

