Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ నిర్వహణ తీరే మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా ఆరోపించారు. ప్రభుత్వాలు అంటే ప్రజల కోరికల మేరకు పనిచేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, అన్ని వ్యవస్థలను సరిగ్గా నడిపించాలి. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఈ వ్యవస్థలను గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు.
సజ్జల ఆరోపణల ప్రకారం, ప్రస్తుత ప్రభుత్వమే నేర స్వభావంతో వ్యవహరిస్తోందని, ముఖ్యంగా తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలే ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’లకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా డొల్లగా మారిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ‘పొలిటికల్ గవర్నెన్స్’ ఒక వికృత రూపం తీసుకుందని మండిపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో ఈ వికృత చేష్టలు పీక్‌కు చేరుకున్నాయని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపించిన వ్యక్తిపైనే కేసులు పెట్టడం దారుణమని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ మద్యం కేసు: వైసీపీ నేతలపై తప్పుడు కేసులు!
నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న వారిని పట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం వచ్చి చాలా కాలం తర్వాత కూడా దాని నిందను తమ పార్టీ నేతలపై వేయడం చాలా బాధాకరమని సజ్జల అన్నారు. నకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం నేత జయచంద్రారెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, టీడీపీ వాళ్ల పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై అనేక నిరాధార ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న కార్యకర్తలపై కేసులు, లడ్డూ కల్తీ అంటూ లేని వివాదాన్ని సృష్టించడం, అలాగే టీడీపీ గ్రూపు గొడవలతో జరిగిన జంట హత్యల కేసును సైతం తమ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై పెట్టారని సజ్జల ఆరోపించారు. సోషల్ మీడియా కేసులో గంజాయి పెట్టి అక్రమ అరెస్టులు చేయడంతో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించిందని ఆయన గుర్తు చేశారు.
నియంతల పాలనలోనూ ఇలా ఉండదు!
తుని మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నా, ఆ కేసుతో సంబంధం లేని వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని సజ్జల విమర్శించారు. తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ చర్యలు తీసుకోకుండా, సంబంధం లేని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. నకిలీ మద్యం తయారు చేసింది టీడీపీ నేతలే అని అన్ని ఆధారాలు ఉన్నా, అసంబద్ధంగా జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. కేసు కోర్టులో నిలబడకపోయినా, కొన్నాళ్లపాటు వైసీపీ వాళ్లను జైల్లో పెట్టాలని ప్రభుత్వం ఆరాటపడుతోందని సజ్జల విమర్శించారు.
నకిలీ మద్యం కేసులో నిందితుడైన జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన విషయం అందరికీ తెలుసని, ఆయన మనుషులే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిపి, తమ షాపుల్లోనే అమ్మకాలు జరిపారని ఆధారాలు ఉన్నాయన్నారు. జయచంద్రారెడ్డికి, జనార్ధన్‌కు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా జయచంద్రారెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా ఇచ్చారని సజ్జల తెలిపారు.
వ్యవస్థలు నీరుగారిపోతున్నాయి: లోకేష్ రెడ్ బుక్ పాలన!
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా ఉందని చంద్రబాబు గారే ఒప్పుకున్నారని, కట్టుదిట్టం చేస్తామని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మద్యం షాపులు పొందిన టీడీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన ఆరోపించారు. జోగి రమేష్ అరెస్టు వ్యవహారం అసలు నియంతల పాలనలో కూడా ఉండదని సజ్జల అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ‘రెడ్ బుక్ పాలన’ నడుస్తోందని, దీని కారణంగా అన్ని వ్యవస్థలు నీరుగారిపోతున్నాయని ఆయన విమర్శించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల గొంతుక వినిపించకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా లోకేష్ గారి నేతృత్వంలో ఒక విధ్వంస పాలన జరుగుతోందని సజ్జల దుయ్యబట్టారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా, తమకు ఇష్టం వచ్చినవారిని ఎన్ని రోజులైనా జైల్లో ఉంచుతున్నారని, ఒక్కొక్క సమస్యను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఒక్కొక్క వైసీపీ నేతను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ‘కక్ష సాధింపు నారా వారి కొత్త చట్టం’గా మారిందని సజ్జల తీవ్ర వ్యాఖ్య చేశారు. జోగి రమేష్ ఇంట్లో పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయని చెప్పడం ద్వారా చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని, నేరం చేయకున్నా శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతున్నా రాష్ట్రంలో నకిలీ మద్యం మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తన విమర్శలను ముగించారు.

