Mayor Couple Murder Case: రాష్టంలోపదేళ్ళ క్రితం సంచలనం రేపిన చిత్తూరు మాజి మేయర్ కఠారి అనునరాధ దంపతుల హత్యకేసులో చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మేయర్ కఠారి అనురాధ దంపతులు హత్యకేసులో 5గురు నిందితులకు మరణ శిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి తీర్పును వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కఠారి మోహన్, అనురాధ దంపతుల హత్య కేసు తీర్పు ఉండటంతో చిత్తూరు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు.. అనుమానితులు, సోషల్ మీడియా పోస్టులపై,వాట్సాప్ మెసేజ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి (ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో వారికి ఉరిశిక్ష విధించింది. దోషుల్లో ఏ1గా ఉన్న చింటూ రూ.70లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కఠారి అనురాధ, మోహన్ వారసులకు రూ.50లక్షలు, గాయపడిన వేలూరి సతీష్ కుమార్ నాయుడికి రూ.20లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది.
Also Read: AP Government: ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం.. చట్టంలో కీలక పదాల మార్పు
తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహన్ కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహన్‌ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబరు 17న చింటూ, మరో నలుగురు బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కఠారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే నేలకొరిగారు. పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడినీ చంపేందుకు మంజునాథ్ (ఏ 4) యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఇందులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశారని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 130 మంది సాక్షులను విచారించారు. ఏ3, ఏ ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్ అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు.ఇక మాజీ మేయర్ దంపతుల హత్య కేసును Rarest of the rare కేసు గా భావించింది చిత్తూరు కోర్టు. ఒక కేసులో ఐదుగురికి ఉరి శిక్ష విధించడం దేశంలో అత్యంత అరుదు చేబుతున్నారు. గోద్రా ఘటనలో 11 మందికి ట్రయల్ కోర్టు ఉరి శిక్ష విధించినప్పటికీ, తర్వాత అది యావజ్జీవ శిక్ష గా మార్పు జరిగింది.. ఇక ఛత్తీస్ ఘడ్ లో ఒక గిరిజన బాలిక పై అత్యాచారం, ఇద్దరి హత్య కేసులో ఐదు మందికి ఉరిశిక్ష పడగా, వారు అప్పీల్ కు వెళ్లడంతో కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. అయితే చిత్తూరు కోర్టు తీర్పు హైకోర్టు కు అపిల్ కు వెళ్ళనున్నారు నిందితులు.

