Putin

Putin: అణు టెన్షన్‌ మళ్లీ మొదలు.. అమెరికాకు గట్టి షాక్‌ ఇచ్చిన పుతిన్

Putin: ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీసుకున్న కీలక నిర్ణయం అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్లుటోనియం మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిస్‌పోజిషన్‌ ఒప్పందంను ఆయన అధికారికంగా రద్దు చేశారు. దీనికి సంబంధించిన చట్టపరమైన పత్రాలపై పుతిన్‌ సంతకం చేశారు.

2000లో అమెరికా–రష్యాల మధ్య ‘ప్లుటోనియం మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిస్‌పోజిషన్‌ అగ్రిమెంట్‌’ కుదిరింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇరుదేశాల వద్ద ఉన్న 34 మెట్రిక్‌ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించుకోవాలని ఈ ఒప్పందం స్పష్టంగా పేర్కొంది. 2010లో ఈ ఒప్పందంలో కొన్ని సవరణలు చేశారు. దీని వల్ల దాదాపు 17,000 అణ్వాయుధాల తయారీని అడ్డుకున్నాం అని అప్పట్లో అమెరికా అధికారులు తెలిపారు.

అయితే 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ఆ సమయంలోనే పుతిన్‌ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ ఇప్పుడు, ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రత పెరుగుతున్న సమయంలో, ఆయన దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యతో మళ్లీ ప్రపంచంలో అణు టెన్షన్‌ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే ‘బురెవెస్ట్‌నిక్‌’ క్రూజ్‌ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష సమయంలో ఆ క్షిపణి 15 గంటల పాటు గాల్లో ఉండి, 14 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని రష్యా సైన్య చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వారెలీ గెరాసిమోవ్‌ తెలిపారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే సిద్ధం చేయాలని పుతిన్‌ సైన్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Mustafabad to Kabir Dham: అక్కడ ముస్లింలు లేరని గ్రామం పేరు మార్పు.. యూపీ సీఎం యోగి నిర్ణయం

రష్యా తాజా చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఉక్రెయిన్‌తో యుద్ధం నాలుగో సంవత్సరానికి చేరుకుంటోంది. ఇది ఒక వారంలో ముగియాల్సినదే. కానీ పుతిన్‌ తన నిర్ణయాలతో దాన్ని లాగేస్తున్నారు,” అని ఆయన అన్నారు. అలాగే రష్యా పరీక్షించిన అణుశక్తి క్షిపణిపై స్పందిస్తూ  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా అణు జలాంతర్గాములు రష్యా తీరానికి దగ్గరగా ఉన్నాయి. మాతో ఆటలు ఆడొద్దు, అని ట్రంప్‌ హెచ్చరించారు. తన వ్యాఖ్యల్లో ఆయన, “పుతిన్‌ యుద్ధాన్ని కొనసాగించకూడదు, శాంతి మార్గం వైపు రావాలి” అని సూచించారు.

పుతిన్‌ ఈ నిర్ణయంతో అమెరికాపై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి పాశ్చాత్య దేశాలు మద్దతు ఇవ్వడం రష్యాకు అసహనంగా మారిందని, అందుకే పుతిన్‌ అణు ఒప్పందం నుంచి తప్పుకోవడం ద్వారా రష్యా శక్తిని చూపించాలనుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. అమెరికా ఇప్పటివరకు రష్యాపై పలు ఆంక్షలు విధించినప్పటికీ, పుతిన్‌ వాటిని పట్టించుకోవడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్లుటోనియం ఒప్పందం రద్దుతో, రష్యా వద్ద ఉన్న అణు మూలపదార్థంను తిరిగి యుద్ధ ప్రయోజనాల కోసం వాడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా యూరప్‌ దేశాలు భయాందోళనల్లో ఉన్నాయి. ఇప్పుడు రష్యా అణు సామర్థ్యాన్ని పెంచితే ప్రపంచ భద్రతకే ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

యూరోపియన్‌ యూనియన్‌, యునైటెడ్‌ నేషన్స్‌ సహా పలు దేశాలు పుతిన్‌ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
అణు ఒప్పందం రద్దు ప్రపంచ శాంతి స్థిరత్వానికి పెద్ద దెబ్బ అని వారు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు కూడా పుతిన్‌ చర్యను అవివేకపూరిత నిర్ణయంగా పేర్కొంటూ, మాస్కోతో మాట్లాడేందుకు సిద్ధమని తెలిపారు.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పుతిన్‌ చేసిన ఈ తాజా చర్య ప్రపంచ రాజకీయ సమతౌల్యాన్ని కుదిపేస్తోంది.
అమెరికా–రష్యా మధ్య అణు ఒత్తిడి మళ్లీ పెరుగుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఏ రూపం దాల్చుతుందో అంతర్జాతీయ సమాజం ఆందోళనతో గమనిస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *