TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో అసలేం జరుగుతోంది? టీటీడీ అనుమతి లేకుండానే.. అప్పటి పరకామణి అధికారి సతీష్ కుమార్ ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారంటూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. హైకోర్టులో నివేదిక సమర్పించారు. అప్పటికి ఇంకా సతీష్ కుమార్ పరకామణిలో ఏవీఎస్వో కాదనీ, ఆయనకు రాజీ చేసుకునే అర్హత లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలానే ఈ కేసులో పిటిషనర్.. సీఐడీ దర్యాప్తు కోరారని, ఆ మేరకు క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని, పిటిషనర్ పొందుపరిచిన అంశాలపై ఈ నెల 28న జరిగే బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ అఫిడవిట్లో నివేదించారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి.. టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే.. అప్పటి వై.సతీష్‌కుమార్ అనే అధికారి లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవడాన్ని అనిల్ కుమార్ తప్పు పట్టారు. ఈవో అఫిడవిట్ అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే వాటి గురించి ప్రస్తావించే ముందు అసలేం జరిగింది? అన్నది ఓసారి చూద్దాం.
Also Read: Cyclone Montha: మొంథా తుఫాన్ ముప్పు.. ఏపీలో రెడ్ అలర్ట్ జారీ!
పోయిన సంవత్సరం.. సెప్టెంబరు 10న శ్రీనివాసులు అనే వ్యక్తి.. పరకామణిలో చోటు చేసుకున్న కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని టీటీడీ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. పరకామణిలో విధులు నిర్వహిస్తోన్న సీవీ రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద మొత్తంలో బంగారం, డాలర్లు దొంగతనం చేశారని.. అప్పట్లో సతీష్‌కుమార్ అనే టీటీడీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారని హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, అనూహ్యంగా ఈకేసు లోక్‌అదాలత్‌లో రాజీ జరిగిపోయింది. అది కూడా ఫిర్యాదుదారుడైన సతీష్‌కుమార్, నిందితుడైన రవికుమార్ ఇద్దరు రాజీ చేసుకోవడం కలకలం రేపింది. ఫిర్యాదు ఇచ్చిన సతీష్‌కుమార్ అనే వ్యక్తే రాజీకి ఎలా ఒప్పుకున్నారు? నిజానికి సతీష్‌కుమార్‌కు స్వామివారిపై విపరీతమైన భక్తి భావంతో పాటూ, టీటీడీలో చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్న పేరుంది. అటువంటి వ్యక్తి స్వామి వారి సొమ్ము కాజేసిన దొంగతో రాజీ చేసుకున్నారంటే… ఆయనపై ఆనాడు పైస్థాయిలో ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో, ఇప్పటి పాలక మండలిలోనూ ఆయనే బలిపశువు కాబోతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, టీటీడీ పైస్థాయి అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు కలిసి.. సతీష్‌కుమార్‌పై ఒత్తిడి పెంచి రాజీకి ఒప్పించారు. నేడు ఆయనకు రాజీ చేసుకునే అర్హత లేదని ప్రస్తుత ఈవో అఫిడవిట్లో పేర్కొన్నారు. సతీష్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలకు సైతం డీజీపీకి నివేదించినట్లు తెలిపారు.
మొత్తంగా ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హైకోర్టు ఆగ్రహిస్తు, నిద్రపోతున్నారా అంటూ చీవాట్లు పెడుతున్నా టీటీడీ యంత్రాంగం అంత తాపీగా ఎందుకు వ్యవహరిస్తోంది.? రాజీకి ఆనాడు టీటీడీ అనుమతి లేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? మొత్తం వ్యవహారం సతీష్‌కుమార్ మీదకు తోసేసి అసలు సూత్రధారులైన ఆ కొందరు అధికారుల్ని రక్షిస్తున్నారా? పోలీసుల ఒత్తిడి మేరకే ఫిర్యాదుదారుడైన సతీష్‌కుమార్ రాజీకి ఒప్పుకున్నట్లు ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్‌లో స్పష్టంగా బయటపడింది. కానీ ఈవో సింఘాల్ మాత్రం టీటీడీకి ఆనాడు సంబంధం లేకుండా ఈ రాజీ జరిగిందని చెప్పడం… ఆ కొందరు అధికారుల్ని కాపాడేందుకే చేస్తున్న ప్రయత్నాలేనా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సరే.. ఎంతటి వారైనా సరే.. న్యాయస్థానాల కళ్లు కప్పగలరేమో కానీ, ఆ స్వామివారిని మోసం చేయలేరని శ్రీనివాసుడి భక్తులు హెచ్చరిస్తున్నారు.

