Kurnool Bus Accident:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 20 మందికి పైగా మరణించినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఓ బైక్‌ను ఢీకొన్న ఘటనతో బస్సు దహనమై, దానిలో ఉన్న ప్రయాణికులు సజీవదహనమయ్యారు. 42 మంది ప్రయాణికులు ఉండగా, 12 మందికి పైగా ప్రాణాలతో బస్సు నుంచి బయటపడ్డారు.
మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థికసాయం: ప్రధాని మోదీ
Kurnool Bus Accident:కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో 20 మంది సజీవదహనం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
బస్సు దుర్ఘటన కలచివేసింది: రాష్ట్రపతి ముర్ము
Kurnool Bus Accident:కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి-కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రమాద ఘటనపై ఆమె స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ముర్ము కోరుకున్నారు.
తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
Kurnool Bus Accident:హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన వెంటనే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బస్సు ప్రమాద ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ప్రమాదంపై సీఎస్, డీజీపీతో తాను మాట్లాడినట్టు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్సపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్
Kurnool Bus Accident:కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదం తనను కలిచి వేసిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.

