Jagan-Adani Data Center: విశాఖకు వస్తోంది గూగుల్ డేటా సెంటర్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది అదానీ డేటా సెంటర్ అని జగన్ చెబుతున్నారు. కట్టేది అదానీ, వాడుకునేది గూగుల్ అంటూ కొత్త పురాణం చెప్పుకొచ్చాడు. జగన్ ప్రెస్మీట్ ఎప్పటిలాగానే మూడు బూతులు – ఆరు అబద్దాలతో గంటల పాటు అలా సాగిపోయింది. తనపై ట్రోల్స్ వస్తున్నాయని తెలుసుకున్నారో ఏమో కానీ… ఈ సారి ప్రెస్మీట్‌లో నాలుగైదు చానళ్ల లోగోలు కనబడేలా చూసుకున్నారు. ఎప్పటిలా తెలుగులో తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఈసారి బాగానే ప్రాక్టీస్ చేసి వచ్చారు. అనర్గళంగా సాగిపోతున్న జగన్ ప్రెస్మీట్‌లో.. ఒకానొక సందర్భంలో చంద్రబాబును గేలి చేసే క్రమంలో ‘సుందర ముకారవిందం’ వంటి పదాన్ని తడబడకుండా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు జగన్‌మోహన్ రెడ్డి. క్లుప్తంగా చెప్పుకుంటే ఇవీ ఇవాల్టి జగన్ ప్రెస్మీట్‌లో మెరుపులు. ఇక అసలు విషయానికి వస్తే.. డేటా సెంటర్ల గురించి మినిమం నాలెడ్జ్ లేని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌లా బట్టీ పట్టిన స్క్రిప్టును సందేహం లేకుండా చదివేశారు జగన్ రెడ్డి. అది గూగుల్ డేటా సెంటర్ కాదని, అదానీ డేటా సెంటర్ అని అతి పెద్ద అబద్దాన్ని అలవోకగా చెప్పేశారు. 80 వేల కోట్లతో తానే డేటా సెంటర్ కడుతున్నట్లు అదానీకైనా తెలుసో తెలీదో కానీ.. జగన్ మాత్రం అది అదానీయే కడుతున్నారని టేబుల్ గుద్ది మరీ చెప్పారు.
ఒక్క ప్రెస్మీట్‌తో డేటా సెంటర్, ఏఐ హబ్‌ల గురించి తన నాలెడ్జ్ ఏంటో తానే బయట పెట్టేసుకున్నారు జగన్ రెడ్డి. విశాఖ గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ పెట్టుబడి 15 బిలియన్ డాలర్లు అంటే 1.3 లక్షల కోట్లు కాగా, 10 బిలియన్ డాలర్లు అంటే 87 వేల కోట్లే అంటున్నారు జగన్ రెడ్డి. డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్, భారతి ఎయిర్‌టెల్ సహకారాన్ని గూగుల్ తీసుకుంటున్న మాట వాస్తవమే కానీ, అదానీనే మొత్తం కడుతున్నారని జగన్ చెబుతున్నారు. గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటులో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నామని అదానీ అంటోంటే… క్రెడిట్ మొత్తం అదానీకి ఇవ్వాల్సిందే అంటూ జగన్ గోల మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అని గూగుల్ కానీ, ఏపీ ప్రభుత్వం కానీ చెప్పడం లేదు. ఎందుకంటే అమెరికాలో గూగుల్‌కి ఇప్పటికే అతి పెద్ద డేటా సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు తానే బీజం వేశానంటూ జగన్ అతిశయోక్తులు జోడిస్తున్నారు. గూగుల్‌తో మాత్రమే ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ప్రాజెక్టు నిర్మాణంలో గూగుల్ తనతో చేర్చుకునే భాగస్వామ్య సంస్థలతో తమకు సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించారు ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్. కానీ డేటా సెంటర్ అదానీ కడతాడు, గూగుల్ వాడుకుంటుంది అంటూ కొత్త పురాణం చెప్పారు జగన్. గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి భారతదేశ డేటా పాలసీలను మార్చి, మరిన్ని ఇంటెన్సివ్స్ కల్పించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
Also Read: Konda Surekha: కొండా సురేఖ వివాదానికి ఎండ్‌కార్డ్: సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన మంత్రి
2023లో జగన్ అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన నాటికి అలాంటి పాలసీలేమీ లేవు. ముఖ్యంగా అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ రెండు వేరు వేరు. అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టు ఈ రోజుకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాత్రమే క్లియర్ చేసుకుంది. జగన్ హయాంలో వచ్చిందని వదిలేయకుండా, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వమే తీసుకుంటోంది. జగన్ చెబుతున్నట్లు అదానీ డేటా సెంటర్‌కి సంబంధించి సబ్‌సీ కేబుల్, ల్యాండింగ్ స్టేషన్, డేటా స్టోరేజ్ స్టేషన్ వంటి నిర్మాణాలేవీ అక్కడ ఇంకా ప్రారంభమే కాలేదు. సెకీతో అదానీ ఒప్పందంలో.. జగన్‌కి 1750 కోట్లు ముడుపులు అందినందువల్ల ఆయన అదానీ భజన చేస్తుండవచ్చు కానీ.. గూగుల్ డేటా సెంటర్ విషయంలో అదానీకి క్రెడిట్ ఇవ్వాల్సిన పనిలేదు. గూగుల్ కోసం గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం వరకే అదానీ పని. గిగా వాట్ డేటా సెంటర్ పెట్టే కెపాసిటీ కానీ, టెక్నాలజీ కానీ అదాని వద్ద లేదు. నిజానికి మన దేశంలోనే అలాంటి టెక్నాలజీ ఉందో లేదో తెలీదు. అందుకే విశాఖకి, మన దేశానికి కూడా గూగుల్ డేటా సెంటర్ అంత ప్రతిష్టాత్మకం అయిందంటునారు టెక్ నిపుణలు. మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ అదానీ ఘనతే అంటున్న జగన్…. తాను మళ్లీ అధికారంలోకి వస్తే గూగుల్‌ని తరిమేసి అదానీకే రాసిస్తానని ఇండైరెక్ట్‌గా చెబుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

