Terrorism Class: పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాదానికి కొత్త రూపం ఇస్తోంది. దేశంలో మహిళలను ఉగ్రవాద దిశగా మళ్లించేందుకు జైషే-ఎ-మొహమ్మద్ (JeM) అనే ఉగ్రవాద సంస్థ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘జమాత్ ఉల్-ముమినాత్’ పేరిట తొలి మహిళా టెర్రరిస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ‘తుఫత్ అల్-ముమినాత్’ అనే ఆన్లైన్ జీహాదీ కోర్సును కూడా ప్రారంభించింది. దీని ద్వారా మహిళలకు మతపరమైన ముసుగులో జీహాదీ భావజాలాన్ని నూరిపోసి, వారిని టెర్రరిజం వైపు మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆన్లైన్ కోర్సు ఫీజును కేవలం PKR 500 (భారత కరెన్సీలో సుమారు రూ.156)గా నిర్ణయించారు. ప్రతిరోజూ 40 నిమిషాల ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించబడతాయని, వీటిలో మహిళలకు జీహాద్, మతం, ఇస్లామిక్ దృష్టికోణంలో వారి “విధులు” గురించి బోధిస్తారని సమాచారం.
ఈ కార్యక్రమానికి జెఎం చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తోంది. ఆమె భర్త యూసుఫ్ అజార్, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన “ఆపరేషన్ సిందూర్”లో సాయుధ దళాల దాడిలో మరణించాడు. ఇప్పుడు సాదియా, తన సోదరి సమైరా అజార్‌తో కలిసి మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడానికి సదస్సులు, ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది.
భద్రతా సంస్థల సమాచారం ప్రకారం, ఈ ప్రయత్నం జెఎం సంస్థ తమ స్థావరాన్ని, ఆర్థిక వనరులను పునర్నిర్మించుకునే వ్యూహంలో భాగమని చెబుతోంది. ఇటీవల “జమాత్ ఉల్-ముమినాత్” మహిళా విభాగాన్ని ప్రకటించిన తర్వాత, అక్టోబర్ 19న పీవోకేలో జరిగిన “దుఖ్తరన్-ఎ-ఇస్లాం” కార్యక్రమంలో ఈ ఆన్లైన్ జీహాదీ కోర్సు అధికారికంగా ప్రారంభించారు.
గతంలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు మహిళలను యుద్ధ పాత్రల్లో వినియోగించకపోయినా, ఇప్పుడు జెఎం ఈ మార్గంలో ముందుకు వెళ్తుండటం భద్రతా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఐసిస్, బోకో హరామ్, హమాస్, ఎల్టీటీఈ వంటి గ్రూపుల తరహాలో మహిళా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేయాలనే ఉద్దేశ్యం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇకపోతే, ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఈ సంస్థల కార్యకలాపాలకు మౌన అనుకూలత ఇస్తోందనే విమర్శలు ఉన్నాయి. FATF నిబంధనలను పాటిస్తున్నామన్న ఇస్లామాబాద్ వాదనల మధ్యే, JeM వంటి సంస్థలు బహిరంగంగా విరాళాలు సేకరిస్తున్నాయి. తాజాగా ఈ సంస్థ ఈజీపైసా ద్వారా రూ.3.91 బిలియన్ల నిధుల సేకరణ ప్రచారం ప్రారంభించినట్లు సమాచారం.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ వైపు జెఎం, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తమ స్థావరాలను మార్చినట్లు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇది ఉగ్రవాద వ్యూహం మరింత చురుకుదనం సంతరించుకుంటోందని సూచిస్తోంది.
మొత్తంగా చూస్తే, పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాదానికి సురక్షిత గూటిగా మారిపోతోంది. ఇప్పుడు మహిళలను కూడా ఉగ్రవాద యంత్రాంగంలో భాగం చేయాలనే జైషే-ఎ-మొహమ్మద్ ప్రయత్నం, దాని భవిష్యత్ దిశ ఎంత ప్రమాదకరంగా మారబోతోందో స్పష్టంగా చూపిస్తోంది.