Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలో బాలికపై అత్యాచార కేసులో నిందితుడైన తాటిక నారాయణరావు (62) బుధవారం అర్ధరాత్రి పోలీసులు నారాయణరావును కోర్టుకు తరలిస్తున్న సమయంలో తుని పట్టణ శివారులోని కోమటిచెరువు వద్ద బహిర్భూమికి వెళ్లాలని అడగడంతో పోలీసులు వాహనాన్ని ఆపారు. ఈ క్రమంలో నిందితుడు ఒక్కసారిగా సమీపంలోని చెరువులోకి దూకి గల్లంతయ్యాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు నారాయణరావు మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవమాన భారం తట్టుకోలేక నిందితుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గురుకుల పాఠశాల బాలికపై అఘాయిత్యం
తునిలో వెలుగుచూసిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిందితుడు నారాయణరావు, మనవరాలి వయసున్న గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి, తినుబండారాలు కొనిపెట్టి దగ్గరయ్యాడు. తాను తాతను అని పాఠశాల సిబ్బందిని నమ్మబలికి, బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకువెళతానని చెప్పి మంగళవారం హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లాడు.
తొండంగి సమీపంలోని ఒక సపోటా తోట వద్ద బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుడొకరు గమనించి నిందితుడు నారాయణరావును ప్రశ్నించగా, తాను టీడీపీకి చెందిన వ్యక్తిని అని చెప్పి దబాయించడానికి ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Massive encounter: ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టిన పోలీసులు
అధికారుల తీవ్ర స్పందన, కేసు నమోదు
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, లోకేష్ లు స్పందిస్తూ, ఇలాంటి ఘటనల్లో నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
నారాయణరావుపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం తోపాటు Cr. No. 250/2025: u/s 137, 65(1) BNS, 2023 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం జరిగిందని నిర్ధారించుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మరోవైపు, మహిళా హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై పోలీసుల నుంచి వివరణ కోరింది.