KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురువారం (అక్టోబర్ 23) బీఆర్ఎస్ అధినేత కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ నేతలు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా స్టార్ క్యాంపెయినర్లు అయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర నేతలు ఎర్రవెల్లి నివాసానికి తరలివెళ్లనున్నారు.
KCR: అదే విధంగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల క్లస్టర్ ఇన్చార్జులు కూడా ఈ సమావేశానికి వెళ్లనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియరాగా, పార్టీ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ఈ తరుణంలో పార్టీ వ్యూహప్రతివ్యూహాలు, ప్రచార సరళిపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలుపొందాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
KCR: ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి తీరాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచారంపై కేసీఆర్ కీలక ఆదేశాలు ఇస్తారని తెలుస్తున్నది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా బహిరంగ సభలతో ప్రచార పటాటోపాలకు వెళ్లకుండా, కాలనీలలో, గల్లీలలోనే కార్నర్ మీటింగ్‌లు పెట్టి ఓటర్లను ఆకట్టుకోవాలని సూచించనున్నారు.
KCR: ఇక మిగిలింది 15 రోజులే కావడంతో ప్రచారంపైనే దృష్టి పెట్టాలని, ఉదయం, సాయంత్ర వేళల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లు అందరినీ కలవాలని ఇప్పటికే కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా, ప్రచారం చివరి దశలో జరిగే రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అప్పటివరకు కేటీఆర్, హరీశ్‌రావు ఇతర ముఖ్య నేతలే ప్రచారంలో పాల్గొంటారు.