Revanth Reddy: వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనేది చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్లో రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.
అమరుల త్యాగం – ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు:
- పోలీసుల రుణం తీర్చుకోలేనిది: “మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము వంటిది, ప్రతి క్షణం పరీక్షే” అని సీఎం కొనియాడారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు, తెలంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని తెలిపారు.
- ఎక్స్‌గ్రేషియా భారీ పెంపు: ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన అధికారుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం గణనీయంగా పెంచింది.
- కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు: కోటి రూపాయలు
- ఎస్సై, సీఐలకు: రూ. 1.25 కోట్లు
- డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు: రూ. 1.50 కోట్లు
- ఎస్పీలు, ఇతర ఐపీఎస్ అధికారులకు: రూ. 2 కోట్లు
- సంక్షేమ పథకాలు: అమరులైన పోలీసు కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్, మెడికల్ సీట్లలో ప్రత్యేక రిజర్వేషన్లు అందిస్తున్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Ram-Bhagyashri: రామ్-భాగ్యశ్రీ లవ్ స్టోరీ.. కన్ఫర్మ్?
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా..
మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో విధి నిర్వహణలో వీరమరణం చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ త్యాగాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు.
- ప్రమోద్ కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా.
- అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో సమానమైన మొత్తాన్ని అందించడం.
- కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు 300 గజాల ఇంటి స్థలం మంజూరు.
- అదనంగా, పోలీస్ సంక్షేమ నిధుల నుంచి రూ. 24 లక్షల (16+8 లక్షలు) ఎక్స్‌గ్రేషియా చెల్లింపు.
పోలీస్ శాఖ విజయాలు, పారదర్శకత:
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించడం, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు అందుకోవడం తెలంగాణ పోలీసు సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని సీఎం కొనియాడారు.
మహిళా సారథ్యం: తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ వంటి కీలక విభాగాలకు మహిళా ఐపీఎస్‌లు సారథ్యం వహించడం, కీలక కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులే జోన్ డీసీపీలుగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలతో కూడిన సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్‌ను అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.