Salman Khan: సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా నిర్వహించిన జాయ్ ఫోరమ్ 2025 కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
సల్మాన్ మాట్లాడుతూ, “మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక హిందీ సినిమా విడుదల చేస్తే తప్పకుండా హిట్ అవుతుంది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలు కూడా ఇక్కడ బాగా వ్యాపారం చేస్తున్నాయి,” అని చెప్పారు.
ఇందుకు కారణం, “ఇక్కడ బలూచిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలో సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేసి చెప్పడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
దీనిపై పాకిస్థాన్ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఆయన పొరపాటుగా అన్నారని చెబుతుండగా, మరికొందరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని అంటున్నారు. ప్రముఖ జర్నలిస్టు స్మితా ప్రకాశ్ స్పందిస్తూ, “సల్మాన్ బలూచిస్థాన్ ప్రజలను పాక్ నుంచి వేరు చేశారంటే అది అద్భుతం” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా బలోచ్ నెటిజన్లు కూడా, “బలూచిస్థాన్ పాక్‌లో భాగం కాదు, అది స్వతంత్ర దేశం” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.