KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీలోని మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆదివారం (అక్టోబర్ 19న) జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదే సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కూతురు, అల్లుడు పాశం పల్లవి, అంజిబాబు కూడా బీఆర్ఎస్‌లో చేరారు.
KTR: ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఎవరెవరి బెండు తీయాలో, ఎవరెవరి సంగతి చూడాలోనన్నా చూస్తామని హెచ్చరికలు చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సంగతి తెలుసని, ఫహీం సంగతీ తెలుసని, అందరి జాతకాలు తనకు తెలుసని, ప్రకాశ్‌గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారాడో తెలుసని, అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. సుల్తాన్‌పూర్ బయటకొస్తుందని, ఘన్సీమియాగూడ కూడా బయటకు వస్తుందంటూ నిగూడంగా చెప్పారు.
KTR: పోయిన దీపావళికి బాంబులేటి బాంబులు పేలుతాయని అన్నాడని, కానీ, ఈ దీపావళికి వాళ్ల ఇంటిలోనే బాంబులు పేలాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఈ సందర్భంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గీతక్క, సీతక్క, సురేఖ అక్క తప్ప ఎవరూ సంతోషంగా లేరని తాను చెప్పేవాడినని, ఇప్పుడు ఆ సురేఖ అక్క కూడా సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు.
KTR: నిన్న కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేశాయని, మళ్లీ అవే పార్టీలు బీసీ బంద్‌లో పాల్గొని రోడ్లపైన డ్రామాలు చేస్తూ మళ్లీ బీసీలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. అందరూ శ్రీ వైష్ణవులేనంట, రొయ్యల బుట్ట మాత్రం మాయమైందంట.. అందరూ మద్దతు తెలుపుతుంటే బీసీ బిల్లు ఎందుకు పాస్ కావడం లేదు.. అని ధ్వజమెత్తారు. 8 మంది బీజేపీ ఎంపీలు, మరో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? అని ప్రశ్నించారు.